పుట:సత్యశోధన.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

పట్టాపుచ్చుకున్నాను - కాని ఆ తరువాత?


గ్రాండ్‌నైట్ అని పేరు. అప్పుడు మామూలు మద్యాలతో బాటు షాంపేన్, ఫోర్‌టువైన్, షెర్రీ మొదలుగాగల మద్యాలు కూడా ఇచ్చేవారు. ఆనాడు నాకు ప్రత్యేక ఆహ్వానాలు బ్రహ్మాండంగా లభిస్తూ ఉండేవి.

అసలు ఈ రకం డిన్నర్ల వల్ల బారిష్టరగుటకు ఏవిధంగా అర్హత చేకూరుతుందో అప్పటికీ, ఇప్పటికీ నాకు బోధపడలేదు. విద్యార్థులు వెళుతూ వుండేవారనీ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సంభాషణకు చర్చకు అవకాశం లభించేదనీ, అక్కడ ఉపన్యాసాలు జరిగేవనీ, వాటివల్ల కొంత లోకజ్ఞానం, కొంత నాగరికత, ఉపన్యాస సమర్థత విద్యార్థులకు కలుగుతూ వుండేదనీ వినికిడి. నా టైము వచ్చేసరికి అవన్నీ పోయాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు దూరం దూరంగా కూర్చోసాగారు. అసలు ప్రయోజనం మృగ్యమైపోయి ఆచారం మాత్రం మిగిలింది. పూర్వాచారాల మీద ఆసక్తి కలిగియుండే ఇంగ్లాండు ఆ ఆచారాన్ని వదలలేదు.

బారిష్టరు పరీక్షకు అవసరమైన పుస్తకాలు తేలిక. అందుకే బారిస్టర్లకు అక్కడ డిన్నర్ బారిష్టర్లని పేరు వచ్చింది, డిన్నర్ బారిష్టర్లంటే తిండిపోతు బారిష్టర్లని అర్థం. పరీక్షలు పేరుకు మాత్రమేనని అందరికీ తెలుసు. ఆ రోజుల్లో రెండు పరీక్షలు జరిగేవి. అవి రోమన్ లా, కామన్ లా పరీక్షలు. ఈ పరీక్షలకు పాఠ్యగ్రంథాలు ఉండేవి. విడివిడిగా చదివి విడివిడిగా పరీక్షలు వ్రాయవచ్చు. కాని ఎవ్వరూ పాఠ్యపుస్తకాలు చదివిన పాపాన పోరు. రెండు వారాలు రోమన్‌లాటీను బట్టీవేసి పరీక్షకు కూర్చుంటారు. రెండు మూడు నెలలు కామన్‌లాటీనును బట్టి వేసి పరీక్షకు కూర్చుంటారు. అటువంటి వాళ్ళను చాలామందిని చూచాను. ప్రశ్నలు తేలిక, పరీక్షకులు ఉదార స్వభావులు. రోమన్‌లా పరీక్షార్థుల్లో నూటికి 95 నుండి 99 మంది ప్యాసయ్యేవారు. పెద్ద పరీక్షలో నూటికి 75 మంది, అంతకంటే ఎక్కువమంది ప్యాస్. అందువల్ల పరీక్షా భయంలేదు. సంవత్సరానికి పరీక్షలు నాలుగుసార్లు జరుగుతూ ఉండేవి. ఇంత అనువుగా వున్న పరీక్షలు కష్టమనిపించవు.

నేను మాత్రం పుస్తకాలన్నీ చదవాలని నిర్ణయించుకున్నాను. పాఠ్యగ్రంథాలు చదవకపోవడం మోసమని నాకు అభిప్రాయం కలిగింది. నేను ఆ పుస్తకాల కోసం డబ్బు బాగా ఖర్చు చేశాను. రోమన్ లా ను లాటిన్ భాషలో చదవదలిచాను. నేను లండన్ మెట్రిక్యులేషన్ పరీక్ష కోసం లాటిన్ భాష అభ్యసించాను. అది ఇప్పుడు బాగా ఉపకరించిది. నేను చదివిన చదువుకు విలువ లేకుండా పోలేదు. దక్షిణాఫ్రికాలో అది నాకు బాగా ఉపయోగపడింది. దక్షిణాఫ్రికాలో రోమన్ డచ్చి భాషలు ప్రామాణికం.