పుట:సత్యశోధన.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

ఆహారంలో మార్పులు - ప్రయోగాలు

ఆహార పదార్థాలను మానుకోవలసి వచ్చింది, కష్టమనిపించింది. అయితే ఈ కష్టం క్షణికమేనని తేలింది. ప్రతిజ్ఞను నెరవేర్చాలనే స్వచ్ఛమైన, సూక్ష్మమైన, స్థిరమైన రుచి, నాలుక మరిగిన క్షణిక రుచి కంటే గొప్పదని తోచింది. అయితే అసలు పరీక్ష మరొకటి వుంది. చేసిన ప్రతిజ్ఞలో అదీ ఒక భాగమే. భగవంతుని రక్షణ పొందిన వాడికి ఎవ్వరూ చెరుపు చేయలేరు కదా!

ఈ ప్రకరణం ముగించేముందు ప్రతిజ్ఞ యొక్క అర్థాన్ని గురించి చెప్పడం అవసరమని భావిస్తున్నాను. మా అమ్మ ఎదుట నేను చేసిన ప్రతిజ్ఞ అలా నిలబడే ఉంది. చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవడం వల్లనే ప్రపంచంలో చాలా అనర్థాలు కలుగుతూ ఉంటాయి. ప్రమాణ పత్రం ఎంత స్పష్టంగా వ్రాసుకోబడ్డా తమకు నప్పే విధంగా మాటలకు అర్థం చెబుతూనే ఉంటారు. స్వార్థం మనిషిని గ్రుడ్డివాణ్ణి చేస్తుంది. గోడమీద పిల్లివాటంగా మూలానికి అర్థాలు చెప్పి, ఆత్మ వంచన చేసుకుని, లోకాన్ని దైవాన్ని మోసగించే ప్రయత్నం చేస్తూ వుంటారు. అసలు ప్రమాణం చేసినవారు ప్రమాణం చేయించినవారు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఇది ఉత్తమ విధానం. రెండు అర్థాలు చెప్పుటకు వీలున్నచోట దుర్భలుడిమాట అంగీకరించడం మంచిది. ఈ రెండు పద్ధతుల్ని అనుసరించకపోతే కలహాలు, అనర్థాలు తప్పవు, సత్యపథం అనుసరించేవాడు ఉత్తమ పద్ధతినే అవలంబించాలి. క్రొత్త అర్థాలు తీసే విద్యావంతులతో అతనికి పని ఉండకూడదు. మాంసానికి సంబంధించినంతవరకు మా అమ్మ ఉద్దేశ్యమే నాకు ప్రధానం. ఇందు నా అనుభవానికిగాని, పాండిత్య గర్వానికిగాని తావులేదు.

ఇంగ్లాండులో ఆర్థిక దృష్టితోను, ఆరోగ్య దృష్టితోను నా పరిశోధనలు జరిగాయి. దక్షిణాఫ్రికాకు వెళ్ళక పూర్వం ఈ విషయమై పరిశోధించలేదు. కాని ఆ తరువాత బాగా పరిశోధనలు చేశాను. ఆ వివరాలు రాబోయే ప్రకరణాల్లో తెలుపుతాను. ఏది ఏమైనా ఆహారం విషయమై ప్రయోగాల బీజం ఇంగ్లాండులోనే నా హృదయంలో పడింది. అసలు మొదటినుండీ మతంలో వున్న వాళ్ళకంటే క్రొత్తగా మతంలో చేరినవాళ్ళకు ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లాండులో శాకాహార విధానం సరిక్రొత్త, నాకూ అది అంతే. మొదట మాంసాహారం మంచిదని నేను నమ్మేవాణ్ణి. కాని తరువాత శాకాహారంలోనికి మారాను. నాకు అబ్బిన ఈ క్రొత్త శాకాహార ప్రవేశానుభవంతో నేను నివసిస్తున్న బేసువాటర్‌పేటలో ఒక శాకాహార క్లబ్బు పెట్టదలచి, అక్కడ కాపురం వున్న సర్ ఎడ్విన్ ఆర్నాల్డుగారిని ఉపాధ్యాక్షునిగా వుండమని కోరాను. వెజిటేరియన్ పత్రికా సంపాదకుడు ఓల్డ్ ఫీల్డు గారు అధ్యక్షులు. నేను కార్యదర్శిని. కొంతకాలం ఆ క్లబ్బు