పుట:సత్యశోధన.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

మార్పులు

నేను ఇంగ్లాండులో ఎల్లకాలం వుంటానా? ధారాళంగా ఉపన్యసించడం నేర్చుకొని ఏం చేయాలి? డాన్సులు చేసి సభ్యుడినవుతానా? ఫిడేల్ మనదేశంలో లేదా? అక్కడ నేర్చుకోవచ్చుకదా! నేను విద్యార్థిని, విద్యాధనం సేకరించేందుకు నేను వచ్చాను. వృత్తి కోసం నేను సిద్ధం కావాలి, సదాచారాల ద్వారా సభ్యుడనని గుర్తించబడితే చాలు. అంతేకదా కావలసింది? ఇంక ఎందుకీ వ్యామోహం?

ఈ విధమైన భావాలను వెల్లడిస్తూ ఒక జాబు ఉపన్యాస కళను నేర్పే గురువు గారికి వ్రాసి పంపాను. ఆయన దగ్గర రెండు మూడు పాఠాలు మాత్రమే నేను నేర్చుకున్నాను. డాన్సు మాష్టరుకు కూడా అదేవిధమైన జాబు వ్రాశాను. ఫిడేల్ నేర్పే గురువుగారి దగ్గరికి ఫిడేలు పుచ్చుకొని వెళ్ళాను. ఎంత వస్తే అంతకు దీన్ని అమ్మివేయమని చెప్పాను. ఆయనతో అప్పటికే కొద్దిగా స్నేహం ఏర్పడింది. అందువల్ల నాకు కలిగిన మోహభ్రమల్ని గురించి ఆయనకు చెప్పాను. డాన్సుల జంజాటం నుండి నేను బయటపడటానికి ఆయన ఇష్టపడ్డాడు.

సభ్యుడు కావాలనే వ్యామోహం సుమారు మూడు మాసాల పాటు నన్ను వదలలేదు. అయితే ఆంగ్ల వేషానికి సంబంధించిన పటాటోపం మాత్రం కొన్ని సంవత్సరాల వరకు సాగింది. అయినా విద్యార్థిగా మారానని చెప్పవచ్చు.


16. మార్పులు

ఆట పాటల్లో పడి నేను ఇష్టం వచ్చినట్లు కాలం గడిపానని ఎవ్వరూ తలంచవద్దు. అప్పుడు కూడా ఒళ్ళు తెలిసే వ్యవహరించానను విషయం పాఠకులు గ్రహించియే యుందురని భావిస్తున్నాను. కొంత ఆత్మశోధన జరిగిన తరువాతనే ఆ వ్యామోహం తొలగిపోయింది. నేను ఖర్చు పెట్టిన ప్రతి పైసా లెక్క వ్రాశాను. ప్రతి చిన్న వ్యయం అనగా కారు ఖర్చు, తపాలా ఖర్చు, వార్తా పత్రికల నిమిత్తం వెచ్చించే ఒకటి రెండ పౌండ్లు మొదలుగా గల వాటినన్నింటిని, పుస్తకంలో వ్రాసి పడుకునే ముందు వాటిని సరిచూచుకునే వాణ్ణి. ఆ అలవాటు యిప్పటికీ నాకు వున్నది. దీనివల్ల అనేక ప్రయోజనాలు కలిగాయి. లక్షలాది రూపాయల ధర్మాదాయం నా చేతుల మీదుగా ఖర్చవుతూ వుండేది. శాఖోపశాఖలుగా అనేక విషయాలకు ధనం ఖర్చు పెడుతున్నా మితంగాను, సరిగాను ఖర్చు చేశాను. ప్రతిరోజు మిగులు చూపానే గాని, తగులు చూపలేదు.