పుట:సత్యశోధన.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

ఆంగ్ల వేషం

చేశాడు. అది నాకు ఒక నగరంలా కనబడింది. విక్టోరియా హోటలును ఖాళీ చేసిన తరువాత ఇంత పెద్ద హోటలును నేను చూడలేదు. విక్టోరియా హోటల్లో నేను ఏవిధమైన ప్రయోగమూ చేయలేదు. అచ్చట ఉన్నన్ని రోజులు ఏమి చేయడానికీ తోచలేదు. కాని ఈ హోటలుకు నన్ను తీసుకురావడానికి ఆయన ఒక ఎత్తు ఎత్తాడని తరువాత బోధపడింది. ఈ హోటలులో చాలామంది భోజనం చేస్తూ ఉంటారు. మధ్యలో మాట్లాడటానికి వీలు ఉండదు. కిక్కురుమనకుండా పెట్టింది తినవలసి వస్తుందనే భావం ఆయనకు కలిగిందన్న మాట. మేము చాలామందిమి ఒక బల్ల దగ్గర కూర్చున్నాము. మొదటి వాయిసూప్, అది దేనితో చేశారా అని నాకు సందేహం కలిగింది. మిత్రుణ్ణి అడగటానికి వీలు లేదు. వడ్డించేవాణ్ణి పిలిచాను. అతణ్ణి ఎందుకు పిలుస్తున్నావని మిత్రుడు గట్టిగా నన్ను అడిగాడు. అంతటితో ఆగక “నీవు ఈ సమాజంలో ఉండగలవు, ఎలా మెలగాలో తెలియకపోతే ఇంకొక హోటలుకు వెళ్ళి భుజించు. నేను వచ్చేదాకా హోటలు బయట వేచి ఉండు” అని కోపంగా అన్నాడు.

ఆయన మాటలు వినగానే నాకు లోలోన సంతోషం కలిగింది. వెంటనే లేచి, బయటికి వచ్చేశాను. దగ్గరలోనే ఒక శాకాహారశాల ఉంది. ప్రొద్దుపోయినందున దాన్ని మూసివేశారు. ఆపూట నాకు తిండిలేదు. తరువాత ఇద్దరం నాటకం చూచేందుకు వెళ్ళాము. ఈ ఘట్టాన్ని గురించి ఆయన ఎన్నడూ నా దగ్గర ఎత్తలేదు. ఎత్తవలసిన అవసరం నాకు లేదు గదా! మా మిత్రకలహం చివరిది ఇదే. అయితే దానివల్ల మా స్నేహానికి ఆటంకం కలగలేదు. ఆయన పడ్డ తపనకు మూలం ప్రేమే. ఆచరణలోను, ఆలోచనలోను వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆయనంటే నాకు అమిత గౌరవం ఏర్పడింది.

మాంసం తినకపోయినా మిగతా విషయాల్లో ఆంగ్లసమాజంలో సరిగా మసల గలనని ఆయనకు తెలియజేయాలని భావించాను. అందుకోసం అశక్యం అనుకొన్న ఆంగ్ల పద్ధతుల్ని అవలంబించ ప్రారంభించాను.

నేను ధరించే దుస్తులు బొంబాయిలో తయారైనవి. అవి ఇంగ్లీషు వారి సమాజానికి పనికిరావని తెలుసుకొని, ఆర్మీ అండ్ నేవి స్టోర్సులో తయారుచేయించాను. పందొమ్మిది షిల్లింగులు పెట్టి చిమ్నీ పాట్‌హాటు కొన్నాను. ఆ రోజుల్లో నేను ఆ హాట్ కోసం ఎక్కువ ధర చెల్లించాను. అంతటితో ఆగక నాగరికతకు నడిగడ్డ అయిన బాండ్ వీధిలో ఒక ఈవెనింగ్ సూటు కోసం పది పౌండ్లు వెచ్చించాను. మా అన్నగారికి జేబులో వ్రేలాడే రెండు పేటల బంగారు గొలును పంపమని వ్రాస్తే ఆయన వెంటనే ఎంతో దయతో పంపించారు, టై కట్టుకోవడం నేర్చుకొన్నాను. మనదేశంలో క్షవరం నాడే అద్దం