పుట:సత్యశోధన.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

29

పరమభక్తుడు భీలేశ్వర్‌కు చెందిన లాఘాముహారాజ్ రామాయణం వినిపిస్తూ వుండేవాడు. ఆయనను కుష్టురోగం పట్టుకుందట. ఆ రోగానికి ఆయన ఏ మందూ వాడలేదు. భీలేశ్వర్‌లో గల మహా శివునికి బిల్వ పత్రాలతో భక్తులు పూజ చేస్తూ వుండేవారు. ఆ విధంగా శివుని స్పర్శ పొందిన బిల్వపత్రాల్ని ఆయన కుష్ఠు సోకిన అవయవాలకు కట్టుకునేవాడు. రామనామ జపం చేస్తూ వుండేవాడు. దానితో అతని కుష్ఠురోగం పూర్తిగా నయమైపోయిందని ఆబాలగోపాలం చెప్పుకునేవారు. అది నిజమో కాదో మాకైతే తెలియదు. కాని ఆయన నోట రామాయణం వినేవారమంతా అది నిజమేనని నమ్ముతూ వుండేవారం. రామాయణగానం ప్రారంభించినప్పుడు ఆయన ఆరోగ్యంగా వున్నాడు. ఆయన కంఠం మధురంగా ఉన్నది. ఆయన రామాయణానికి సంబంధించిన దోహాచౌపాయిలు పాడుతూ వాటి అర్థం చెపుతూ అందులో తను లీనమైపోయేవాడు. శ్రోతలు తన్మయత్వంతో ఆయన గానం వింటూ వుండే వారు. అప్పుడు నాకు పదమూడు సంవత్సరాల వయస్సు. ఆయన రామకథ వినిపిస్తూ వుంటే ఆనందంతో వింటూ వుండేవాణ్ణి, యిప్పటికీ నాకు ఆ విషయం గుర్తు వుంది. ఆనాటి రామాయణ శ్రవణం వల్ల నాకు రామాయణం యెడ ప్రేమ అంకురించిన మాట నిజం. తులసీదాసు రామాయణం సర్వోత్తమమైన గ్రంధం.

కొద్దినెలల తరువాత మేము రాజకోటకు వచ్చాము. అక్కడ రామాయణ కాలక్షేపానికి అవకాశం చిక్కలేదు. కాని ప్రతి ఏకాదశి నాడు భాగవత పారాయణం జరుగుతూ వుండేది. నేను అప్పుడప్పుడు భాగవతం విందామని వెళ్ళేవాణ్ణి. ఆ పౌరాణికుడు జనాన్ని ఆకర్షించలేకపోయాడు. భాగవతం భక్తి ప్రధానమైనదని తెలుసుకున్నాను. నేను దాన్ని గుజరాతీ భాషలో తన్మయుడనై చదివాను. మూడు వారాలపాటు నేను ఉపవాసదీక్ష వహించిన సమయంలో పండిత మదన మోహన మాలవ్యాగారు మూలంలోని కొన్ని ఘట్టాలు చదివి వినిపించారు. మాలవ్యావంటి మహాభక్తుని నోట భాగవతం వినే అదృష్టం నాకు కలిగింది. అట్టి అదృష్టం బాల్యంలోనే కలిగియుంటే దానిపై గాఢమైన ప్రీతి కలిగియుండేది కదా అని అనుకున్నాను. బాల్యంలో శుభాశుభ సంస్కారాల ప్రభావం అమితంగా హృదయం మీద పడుతుంది. అందువల్ల బాల్యకాలంలో అటువంటి గ్రంథాలు ఎక్కువగా వినలేక పోతినను విచారం నాకు కలుగుతూ వుంటుంది.

రాజకోటలో వున్నప్పుడు సర్వమత సంప్రదాయాలయెడ సమత్వభావం సునాయాసంగా ఏర్పడింది. హిందూమతమందలి అన్ని సంప్రదాయాల యెడ నాకు ఆదరభావం కలిగింది. మా తల్లిదండ్రులు ఇక్కడ రామాలయానికి శివాలయానికి