పుట:సత్యశోధన.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

దొంగతనం - ప్రాయశ్చిత్తం

మురుగు వుంది. దానిలో ఒక తులం ముక్క తీయించడం తేలిక అని నిర్ణయించాం ఆ పని చేశాం. అప్పు తీర్చాం. కాని ఈ చర్యను నేను సహించలేకపోయాను. ఇక దొంగతనం చేయకూడదని నిశ్చయించుకున్నాను. అయితే నా మనస్సు శాంతించలేదు. తండ్రిగారికి చెప్పవలెనని అనిపించింది. కాని ఆయన ముందు నోరు విప్పి ఈ విషయం చెప్పేందుకు సాహసం కలుగలేదు. వారు కొడతారనే భయం కలుగలేదు. తన బిడ్డలనెవ్వరినీ మా తండ్రి కొట్టరు. బంగారు మురుగు విషయం చెబితే మనస్తాపంతో క్రుంగిపోతారనే భయం నన్ను పట్టుకుంది. ఏది ఏమైనా దోషం అంగీకరిస్తేనే బుద్ధి కలుగుతుందని విశ్వాసం కలిగింది. తండ్రికి మనస్తాపం కలిగించినా పరవాలేదని భావించాను.

చివరికి ఒక చీటీ మీద చేసిన తప్పంతా వ్రాసి క్షమించమని ప్రార్థించాలి అను నిర్ణయానికి వచ్చాను. ఒక కాగితం మీద జరిగినదంతా వ్రాశాను. వెళ్ళి మా తండ్రిగారికి యిచ్చాను. ఇంతటి తప్పు చేసినందుకు తగినవిధంగా శిక్షించమని, యిక ముందు దొగతనం చేయనని శపధం చేశాను. ఇదంతా వ్రాసిన చీటీ వారి చేతికి యిస్తున్నప్పుడు వణికి పోయాను. మా తండ్రి భగందర రోగంతో బాధపడుతూ మంచం పట్టి వున్నారు. ఆయన బల్లమీద పడుకుని వున్నారు. చీటీ వారిచేతికి యిచ్చి ఎదురుగా నిలబడ్డాను.

వారు చీటీ అంతా చదివారు. వారి కండ్ల నుండి ముత్యాలవలె కన్నీరు కారసాగింది. ఆ కన్నీటితో చీటీ తడిసిపోయింది. ఒక్క నిమిషము సేపు కండ్లు మూసుకుని ఏమో యోచించారు. తరువాత చీటీని చింపివేశారు. మొదట చీటీ చదివేందుకు ఆయన పడకమీద నుంచి లేచారు. ఆ తరువాత తిరిగి పడుకున్నారు. నాకు కూడ ఏడుపు వచ్చింది. తండ్రికి కలిగిన వేదనను గ్రహించాను. చిత్రకారుడనైతే ఈ రోజున కూడా ఆ దృశ్యాన్ని చిత్రించగలను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కండ్లకు కట్టినట్లు కనబడుతున్నది. వారి ప్రేమాశృవులు నా హృదయాన్ని కడిగివేశాయి. అనుభవించిన వారికే ఆ ప్రేమ బోధపడుతుంది.

“రామబాణ్ వాగ్యాంరే హొయ్ తే జేణే” రామబాణం మహిమ ఆ బాణం తగిలిన వాడికే తెలుస్తుంది. అని దాని అర్థం. ఆ ఘట్టం నాకు మొదటి అహింసా పాఠం అయింది. పితృవాత్సల్యం అంటే ఏమిటో అప్పుడు నాకు బోధపడలేదు. కాని ఈనాడు ఆలోచిస్తే అదంతా అహింస మహిమేనని అనిపిస్తుంది. అట్టి అహింస అంతటా వ్యాప్తమైనప్పుడు దాని స్పర్శ తగలకుండా వుండదు. అహింసా శక్తి అమోఘం.