పుట:సత్యశోధన.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

దొంగతనం - ప్రాయశ్చిత్తం

 వెళ్ళిపోతాడు. స్నేహితులలో అనుమానం పెరిగితే స్నేహం దెబ్బతింటుంది. భర్త మీద అనుమానం కలిగితే లోలోన భార్య కుమిలిపోవలసిందే. కాని భార్య మీద భర్తకు అనుమానం కలిగితే పాపం ఆమె ఏం చేస్తుంది? ఆమె ఎక్కడికి వెళుతుంది? పెద్ద కులాలకు చెందిన హిందూ స్త్రీ కోర్టుకెక్కి విడాకులు కోరగల స్థితిలో కూడా లేదు. యీ విధంగా స్త్రీ విషయంలో న్యాయం ఏకపక్షంగా వున్నది. నేను కూడా అట్టి న్యాయాన్నే అనుసరించాను. అందువల్ల కలిగిన దుఃఖం ఎన్నటికీ పోదు. అహింసను గురించి పూర్తి జ్ఞానం కలిగిన తరువాతే అనుమాన ప్రవృత్తి నాలో తగ్గింది. అంటే బ్రహ్మచర్య మహత్తు నేను తెలుసుకున్న తరువాత, భార్య, భర్తకు దాసి కాదనీ, అతడి సహచారిణి అనీ, సహధర్మచారిణి అనీ యిద్దరూ సుఖదుఃఖాలలో సమాన భాగస్వాములనీ, మంచి చెడులు చూచే స్వాతంత్ర్యం భర్తకు వున్నట్లే భార్యకు కూడా వున్నదనీ నేను తెలుసుకోగలిగాను. తరువాతనే అనుమాన ప్రవృత్తి తొలగిపోయింది. అనుమానంతో నేను వ్యవహరించిన కాలం జ్ఞాపకం వచ్చినప్పుడు నా మూర్ఖత్వం, విషయవాంఛల ప్రభావం వల్ల కలిగిన నిర్ధాక్షిణ్యం మీద నాకు కోపం వస్తుంది. మిత్రుని మీద కలిగిన మోహాన్ని తలుచుకున్నప్పుడు నా మీద నాకే జాలి కలుగుతుంది.

8. దొంగతనం - ప్రాయశ్చిత్తం

మాంసభక్షణ ప్రారంభించిన కాలంనాటి మరికొన్ని దోషాలు కూడా వివరించవలసినవి వున్నాయి. అవి నా వివాహం కాకపూర్వం నాటివి, ఆ తరువాతవి కూడా.

నా ఒక బంధువు సావాసంలోపడి సిగరెట్టు తాగాలని నాకు సరదా కలిగింది. మా దగ్గర డబ్బులు లేవు, సిగరెట్టు త్రాగితే కలిగే ప్రయోజనం ఏమిటో, దాని వాసనలో గల మజా ఏమిటో మా యిద్దరిలో ఎవ్వరికీ తెలియదు. కాని పొగ ఊదుతూ వుంటే మజాగా వుండేది. మా పినతండ్రికి ఆ అలవాటు వున్నది. ఆయన, మరో కొంతమంది పొగపీల్చి సుతారంగా బయటికి వదులుతూ వుండటం చూచి మాకు కూడా ఒక దమ్ము లాగుదామునే కోరిక కలిగింది. మా దగ్గర డబ్బులు లేవు. అందువల్ల మా పినతండ్రి కాల్చిపారేసిన సిగరెట్టు ముక్కలు ఏరి కాల్చడం ప్రారంభించాము. అయితే అవి అనుకున్నప్పుడల్లా దొరికేవి కావు. దొరికినా ఎక్కువ పొగ వచ్చేది కాదు. అందువల్ల నౌకర్ల డబ్బు దొంగిలించి బీడీలు కొనడం ప్రారంభించాము. అయితే వాటిని ఎక్కడ దాచడమా అను సమస్య వచ్చింది. పెద్దవాళ్ళ ముందు ఎలా కాల్చడం? అందువల్ల దొంగిలించిన డబ్బుతో దేశవాళీ సిగరెట్లు కొని రహస్యంగా త్రాగడం ప్రారంభించాం.