పుట:సత్యశోధన.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

421

కోరుతున్నాను. మా ఆ రిపోర్టులో ఎక్కడా అతిశయోక్తులు చోటు చేసుకోలేదని చెప్పగలను. ప్రకటించిన దురంతాలకు సాక్ష్యాలు అక్కడే యివ్వబడ్డాయి. సందేహించవలసిన మాట ఒక్కటి కూడా రిపోర్టులో లేదని స్పష్టంగా చెప్పగలను. సత్యాన్ని మాత్రమే ఎదురుగా పెట్టుకొని తయారుచేయపబడ్డ మా రిపోర్టునందు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్లు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఎంతటి ఘోరాలకైనా తెగించగలరని నిరూపించాము. మా రిపోర్టులో పేర్కొనబడిన ఒక్క మాట కూడా అసత్యమని ఎవ్వరూ అనలేకపోయారు. 

36. ఖిలాఫత్‌కు బదులు గోసంరక్షణా?

పంజాబ్‌లో జరిగిన మారణకాండను కొంచెం సేపు వదిలివేద్దాం. పంజాబ్‌లో డయ్యర్ నియంతృత్వ దురంతాల పరిశీలన కాంగ్రెస్ పక్షాన జరుగుతూ వున్నది. యింతలో ఒక ప్రజావేదికకు సంబంధించిన ఆహ్వానం నాకు అందింది. దాని మీద కీ.శే. హకీం సాహబ్ మరియు భాయి అసఫ్ అలీగార్ల పేర్లు వున్నాయి. శ్రద్ధానంద్‌గారు సభలో పాల్గొంటారని అందు వ్రాశారు. ఆయన ఆ సభకు అధ్యక్షుడు అని గుర్తు. ఢిల్లీలో ఖిలాఫత్ గురించి యోచించుటకు రాజీకి అంగీకరించాలా లేదా అని నిర్ణయించుటకు హిందూ ముస్లిములు కలిసి ఏర్పాటు చేసిన సమావేశం అది. నవంబరు మాసంలో ఆ సభ ఏర్పాటు చేయబడినట్లు నాకు గుర్తు. ఆ సమావేశంలో ఖిలాఫత్ విషయం మీదనే గాక గోసంరక్షణను గురించి చర్చ జరుగుతుందని, అందుకు యిది మంచి తరుణమని అందు వ్రాశారు. నాకు ఆ వాక్యం గుచ్చుకుంది. సమావేశంలో పాల్గొనుటకు ప్రయత్నిస్తానని వ్రాసి ఖిలాఫత్ సమస్యకు గోసంరక్షణ సమస్యకు ముడివేయడం బేరసారాలు సాగించడం మంచిది కాదని, ప్రతివిషయం మీద దాని గుణదోషాలను బట్టి చర్చించాలని వ్రాశాను. తరువాత సభ జరిగింది. నేను వెళ్లి అందు పాల్గొన్నాను. జనం బాగా వచ్చారు. అయితే యితర సమావేశాలవలె యిది హడావుడిగా జరగలేదు. శ్రద్ధానంద కూడా సభలో పాల్గొన్నారు. నేను యోచించిన విషయాన్ని గురించి వారితోకూడా మాట్లాడాను. నా మాట వారికి నచ్చి ఆ విషయం సమావేశంలో చెప్పమని అని ఆయన ఆ పని నాకే అప్పగించారు. డా. హకీంసాహెబ్‌ తోకూడా మాట్లాడాను, ఇవి రెండు వేరువేరు విషయాలు. వాటి గుణదోషాలనుబట్టి యోచించాలని నా భావం. ఖిలాఫత్ వ్యవహారం నిజమైతే గవర్నమెంట్ సరిగా వ్యవహరించక అన్యాయంచేస్తే హిందువులు మహమ్మదీయులను సమర్ధించాలి,