పుట:సత్యశోధన.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

419

పెట్రేగిపోయిన ఆ నవయువకులు సహాయ నిరాకరణోద్యమాన్ని నేను మధ్యలో వాయిదావేసి యుండకపోతే జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ జరిగియుండేది కాదని, మిలటరీ చట్టం అమలులోకి వచ్చియుండేది కాదనే స్థితికి వెళ్లారు. గాంధీ గనుక పంజాబులో అడుగు పెడితే తుపాకీతో కాల్చి పారేస్తామని కూడా కొందరు బెదిరించారు. కాని నేను చేసిన పని సరియైనదేనని, తెలివిగల వాళ్లెవరూ అందుకు భిన్నంగా ఆలోచించరని నా నిశ్చితాభిప్రాయం. పంజాబు వెళ్లడానికి ఎంతో తొందరపడ్డాను. నేను పంజాబు చూడలేదు. చూడగలిగినంత వరకు పంజాబును చూడాలని అభిలాష కలిగింది. నన్నక్కడికి ఆహ్వానించిన డా. సత్యపాల్, డా. కిచలూ, పండిత రామభజదత్త చౌదరిగారలను చూడాలని ఆరాటం ఎక్కువైంది. వారు జైల్లో ఉన్నారు. అయితే వాళ్లను ప్రభుత్వం ఎక్కువ కాలం జైల్లో వుంచలేదని నాకు తెలుసు. బొంబాయి వెళ్లినప్పుడే అనేకమంది పంజాబు సోదరులు వచ్చి నన్ను కలియడం ప్రారంభించారు. వారిని ప్రోత్సహించాను. వారంతా సంతోషంతో తిరిగి వెళుతూ వుండేవారు. నేను ఎంతో ఆత్మవిశ్వాసంతో వున్నా నా పంజాబు యాత్ర వాయిదా పడుతూనే వుంది. వైస్రాయి ప్రతిసారి “అప్పుడే కాదు” అంటూ నన్ను పంజాబుకు వెళ్లనీయలేదు.

ఈలోపున హంటర్ కమిటీ వచ్చింది. ఆ కమిటీ వాళ్లు పంజాబులో మిలటరీ పాలన యందు జరిగిన అధికారుల చర్యలను పరిశీలించవలసి వున్నది. దీనబంధు ఆండ్రూసు అక్కడకు వెళ్లారు. వారి జాబుల్లో హృదయాన్ని కదిలించే వర్ణనలు నిండివున్నాయి. పత్రికల్లో వెలువడిన వివరాల కంటే అక్కడ జరిగిన ఘోరాలు అధికంగా వున్నాయని వారి జాబుల వల్ల తెలిసింది. మీరు త్వరగా పంజాబు రావాలని వారు వ్రాశారు. వెంటనే పంజాబు చేరమని మాలవ్యాగారి టెలిగ్రాములు వస్తున్నాయి. అందువల్ల నేను మళ్లీ వైస్రాయికి తంతి పంపాను. ఫలానా తేదీన మీరు వెళ్లవచ్చునని ఆయన సమాధానం పంపాడు. అయితే ఆ తేదీ యిప్పుడు సరిగా జ్ఞాపకం లేదు. కాని అది అక్టోబరు 17వతేదీ అయి వుంటుంది.

నేను వెంటనే లాహోరుకు బయలుదేరాను. అక్కడి దృశ్యం ఎన్నటికీ మరచిపోలేను. స్టేషను దగ్గర జనం విపరీతంగా వున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి విడిపోయి ఎక్కడో నివసిస్తున్న తమ కుటుంబీకుడు వస్తున్నట్లు వారి ప్రవర్తనా తీరు ప్రకటిస్తున్నది. అక్కడి జనం హర్షానందంతో ఉన్మత్తులైపోతున్నారు. పండిత రామభజదత్త చౌదరిగారింట్లో నాకు మకాం ఏర్పాటు చేశారు. నేను మొదటినుండి ఎరిగిన