పుట:సత్యశోధన.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

413

సిద్ధమే. అహమదాబాదులో జనం యిష్టం వచ్చినట్లు వ్యవహరించారు అంటే నాకు విచారం కలుగుతుంది. అమృతసర్‌ను గురించి నాకేమీ తెలియదు. అక్కడికి నేను ఎప్పుడూ వెళ్లలేదు. అక్కడ నన్ను ఎవ్వరూ ఎరుగరు. పంజాబు ప్రభుత్వం నన్ను ఆపి వుండకపోతే అక్కడ జనాన్ని శాంతింపచేసేందుకు గట్టి కృషి చేసి యుండేవాణ్ణి. నన్ను వెళ్ళకుండా ఆపి ప్రభుత్వమే జనాన్ని రెచ్చగొట్టింది” అని అన్నాను.

ఈ విధంగా మాటలు సాగుతూ వున్నాయి. మా ఇద్దరి అభిప్రాయాలు కలవడం లేదు. చౌపాటీ దగ్గర మీటింగు జరిపి ప్రజలకు శాంతంగా వుండమని చెబుతానని చెప్పి అక్కడినుండి వచ్చివేశాను.

చౌపాటీ దగ్గర సభ జరిగింది. ప్రజలకు శాంతిని గురించి, సత్యాగ్రహ ఆదర్శాల గురించి వివరించి చెప్పాను. “సత్యాగ్రహం అంటే సత్యపు క్రీడ. ప్రజలు శాతంగా వుండకపోతే నేను సత్యాగ్రహ పోరాటం జరపలేను” అని చెప్పాను. అహమదాబాదులో కూడా దొమ్మీ జరిగిందని అనసూయాబెన్‌కు సమాచారం అందింది. ఆమెను అరెస్టు చేశారని ఎవరో పుకారు లేవదీశారు. దానితో కార్మికులు పెట్రేగిపోయారు. వాళ్ళు హర్తాళ్‌తోబాటు ఉపద్రవానికి పూనుకున్నారు. ఒక సైనికుణ్ణి ఖూనీ చేశారు. నేను అహమదాబాదు వెళ్లాను. నడియాద్ దగ్గర రైలు పట్టాలు పీకివేసేందుకు ప్రయత్నించారని అక్కడ నాకు తెలిసింది. వీరంగావ్‌లో ఒక గవర్నమెంటు కార్యకర్తను చంపివేశారు. అహమదాబాదు చేరాను. అక్కడ మార్షల్ లా అమలు చేశారు. జనం జంకినట్లు కనబడింది. చేసిందానికి వడ్డీతో సహా జనానికి గవర్నమెంటు వారు సైన్య సాయంతో ముట్టచెబుతూ వున్నారన్నమాట. నన్ను స్టేషను నుండి కమీషనరు మిస్టర్ ప్రెట్ దగ్గరకి తీసుకుని వెళ్లేందుకు మనుష్యులు సిద్ధంగా వున్నారు. నేను వారి దగ్గరికి వెళ్లాను. ఆయన ఎంతో కోపంగా వున్నాడు. నేను ప్రశాంతంగా సమాధానాలిచ్చాను. జరిగిన హత్యలకు విచారం వ్యక్తం చేశాను. మార్షల్ లా అనవసరమని కూడా చెప్పాను. తిరిగి శాంతి నెలకొల్పేందుకు ఏం చేయమంటే అది చేస్తానని చెప్పాను. బహిరంగ సభ జరిపేందుకు అనుమతి కోరాను. ఆశ్రమ ప్రదేశంలో ఆ సభ జరుపుతానని చెప్పాను. నా అభిప్రాయం ఆయనకు నచ్చింది. ఏప్రిల్ 13వతేదీ ఆదివారం నాడు బహిరంగ సభ జరిపినట్లు నాకు గుర్తు. ఆ రోజునో లేక ఆ మరునాడో మార్షల్ లా ఎత్తివేశారు. సభలో ప్రసంగిస్తూ జనం చేసిన పొరపాటు ఏమిటో తెలియజేసేందుకు ప్రయత్నించాను. అందుకు ప్రాయశ్చింత్తంగా మూడు రోజులు ఉపవాసం చేయమని చెప్పాను. హత్యలు కావించి వారు తమ తప్పు అంగీకరించి ప్రభుత్వానికి లొంగిపొమ్మని సలహా