పుట:సత్యశోధన.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

408

ఆ వారం - 1

ఢిల్లీలో జరిగినట్లుగానే లాహోరు, అమృతసర్‌లో కూడా హర్తాళ్ జరిగింది. వెంటనే అమృతసర్ రమ్మని డా. సత్యపాల్ మరియు కిచలూగారల తంతి అందింది. యీ యిద్దరు సోదరుల్ని నేను బొత్తిగా ఎరుగను. ముందు ఢిల్లీ వెళ్లి తరువాత అమృతసర్ వస్తానని వారికి తెలియజేశాను. బొంబాయిలో ఆరవ తేదీ ఉదయం వేలాదిమంది జనం చౌపాటీ దగ్గర స్నానం చేసి దేవాలయానికి వెళ్ళేందుకు ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపులో స్త్రీలు, పిల్లలు కూడా వున్నారు. ముస్లిములు కూడా పెద్ద సంఖ్యలో అందు పాల్గొన్నారు. వారు త్రోవలో మమ్మల్ని మసీదుకు తీసుకువెళ్లారు. అక్కడ సరోజినీదేవిని మరియు నన్ను ఉపన్యాసం యిమ్మని కోరారు. మేము ఉపన్యాసాలు యిచ్చాము. శ్రీ విఠల్ దాస్ జెరాజాణి స్వదేశీ మరియు హిందూ ముస్లిం సమైక్యతకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయిద్దామని సూచించాడు. తొందరపాటుగా ప్రతిజ్ఞ చేయించడానికి నేను యిష్టపడలేదు. జరిగినదానితో తృప్తిపడమని సలహా యిచ్చాను. ప్రతిజ్ఞ చేసిన తరువాత ఉల్లంఘించకూడదు కదా! స్వదేశీ అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలని, హిందూ ముస్లిం సమైక్యతకు సంబంధించిన ప్రతిజ్ఞను అర్ధం చేసుకోవాలని చెప్పి యిట్టి ప్రతిజ్ఞ చేయదలచినవారు రేపు ఉదయం చౌపాటి దగ్గరకు రమ్మని చెప్పారు.

బొంబాయిలో పూర్తిగా హర్తాళ్ జరిగింది. అక్కడ చట్టాల్ని ఉల్లంఘించే కార్యక్రమం నిర్ణయించబడింది. రద్దు చేయడానికి అనుకూలమైన చట్టాలను, ప్రతివారు తేలికగా ఉల్లంఘించుటకు వీలైన చట్టాలను ఉల్లంఘించాలని నిర్ణయం చేశాము. ఉప్పు పన్ను ఎవ్వరికీ ఇష్టం లేదని తేలింది. దాన్ని రద్దుచేయాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీమీ ఇండ్లలో ఉప్పు తయారుచేసి తీసుకురమ్మని చెప్పాను. ప్రభుత్వం నిషేధించిన పుస్తకాల్ని అమ్మాలని చెప్పాను. అట్టి పుస్తకాలు నావే రెండు వున్నాయి (1) హింద్ స్వరాజ్ (2) సర్వోదయ్. యీ పుస్తకాలను అచ్చు వేయడం తేలిక. ఆ విధంగా చట్టాన్ని ఉల్లంఘించవచ్చు. వెంటనే ఆ పుస్తకాలు అచ్చువేయాలని మరునాడు సాయంత్రం చౌపాటీలో జరిగిన సభలో వాటి అమ్మకం జోరుగా జరపాలని నిర్ణయం గైకొన్నాం. ఒక కారులో నేను, మరో కారులో సరోజినీ నాయుడు బయలుదేరాం. ముద్రించబడిన పుస్తక ప్రతులన్నీ అమ్ముడుబోయాయి. వచ్చిన సొమ్మంతా యుద్ధ కార్యక్రమం నిమిత్తం ఖర్చు చేయాలని నిర్ణయం గైకొన్నాం. పుస్తకం ధర నాలుగు అణాలు, అయితే నా చేతికి, సరోజినీ దేవి చేతికి మూల్యం మాత్రమేగాక తమ జేబులో వున్న సొమ్మంతా యిచ్చి చాలామంది పుస్తకాలు కొన్నారు. కొందరు అయిదు, పది