పుట:సత్యశోధన.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

406

అద్భుతమైన దృశ్యం

దక్షిణాది ప్రాంతాలు నా స్వగృహాలు అని అనిపించేవి. దక్షిణాఫ్రికాలో ఏర్పడ్డ సంబంధం వల్ల తెలుగు, తమిళం భాషల వారిమీద నాకు హక్కు వున్నట్లు భావించేవాణ్ణి. ఆవిధంగా భావించడంలో పొరబడలేదనే విశ్వాసం ఇప్పటికీ నాకు వున్నది. కీ.శే. కస్తూరీ రంగస్వామి అయ్యంగారి ఆహ్వానం నాకు అందింది. ఆ ఆహ్వానం వెనుక శ్రీ రాజగోపాలాచార్యులు వున్నారు. ఆ విషయం మద్రాసు చేరిన తరువాత నాకు తెలిసింది. శ్రీ రాజగోపాలాచార్యులతో ఇది నాకు ప్రథమ పరిచయమని చెప్పవచ్చు. వారి రూపాన్ని మొదటిసారి చూచాను. ప్రజా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాలనే ఉద్దేశ్యంతో కస్తూరి రంగస్వామి అయ్యంగారి వంటి మిత్రుల ప్రోత్సాహంతో సేలం వదిలి పెట్టి మద్రాసులో వకీలు వృత్తి, ఆచార్యులు ప్రారంభించబోతున్నారని తెలిసింది. వారింటి దగ్గరే నాకు మకాం ఏర్పాటుచేశారు. అయితే యీ విషయం నాకు రెండు రోజుల తరువాత తెలిసింది. కస్తూరి అయ్యంగారి బంగళాలో నేను అతిథిగా వున్నానని అనుకున్నాను. మహాదేవదేశాయి నా పొరపాటును సరిచేశారు. రాజగోపాలచారి మా ఎదుట పడకుండా తప్పుకు తిరుగుతూ వున్నాడు. అయితే మహాదేవ్ ఆయనను పసిగట్టి “మీరు రాజగోపాలాచారితో పరిచయం చేసుకోవాలి” అని నాకు చెప్పాడు.

నేను పరిచయం చేసుకున్నాను. రోజూ యుద్ధ ప్రణాళికను గూర్చి సలహా సంప్రదింపులు జరుపవలసిన అవసరం ఏర్పడింది. సభలు తప్ప నాకు మరేమీ తోచడం లేదు. రౌలట్ బిల్లు చట్టరూపం దాలిస్తే దాన్ని సవినయంతో ఎలా ఎదుర్కొనడం? అట్టి అవకాశం ప్రభుత్వం కల్పిస్తేనే గదా? ఆ చట్టాన్ని సవినయంగా వ్యతిరేకిస్తే దానికి గల హద్దు ఏమిటి? ఈ విషయాలపై మా మధ్య చర్చ జరుగుతూ వుండేది. శ్రీ కస్తూరి రంగస్వామి అయ్యంగారు కొద్దిమంది నాయకుల్ని పిలిచి సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో బాగా చర్చ జరిగింది. ఆ చర్చలో శ్రీ విజయ రాఘవాచార్యులు పాల్గొన్నారు. ఆయన సూక్ష్మంగా కొన్ని సూచనలు చేసి సత్యాగ్రహం మీద పుస్తకం వ్రాయమని సలహా యిచ్చారు. అది నా శక్తికి మించినపని అని చెప్పాను.

ఇంకా ఒక నిర్ణయానికి మేము రాలేదు. పొయ్యి మీద పులగం వుడుకుతూ వుంది. ఇంతలో బిల్లు చట్టం రూపంలో గెజెట్‌లో ప్రకటించబడిందను వార్త మాకు అందింది. ఈ వార్త అందిననాటి రాత్రి ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ నిద్రపోయాను. ప్రాతఃకాలం మెళుకువ వచ్చింది. అర్ధ నిద్రావస్థలో ఒక స్వప్నం వచ్చింది. అందు ఒక సలహా వినబడింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశమందంతటా హర్తాలు జరపమని ప్రకటన చెయ్యాలి. సత్యాగ్రహం ఆత్మశుద్ధికి సంబంధించిన