పుట:సత్యశోధన.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

402

రౌలట్ ఆక్టు - ధర్మసంకటం

స్వతంత్ర స్వభావం గల వ్యక్తి. మంచు చికిత్స తప్పదని ఆయన భావం. నా జబ్బు విషయం తెలిసి మంచి చికిత్స చేయడానికి వచ్చాడన్నమాట. ఆయనకు ఐస్ డాక్టర్ అని పేరు పెట్టాము. తన చికిత్స అంటే ఆయనకు గట్టి నమ్మకం. డిగ్రీ హోల్డర్ల కంటే తను గొప్ప డాక్టరునని ఆయనకు అపరిమితమైన విశ్వాసం.

అయితే తనకెంత విశ్వాసంవుందో అంత విశ్వాసం నాకు కలిగించలేకపోయాడు. ఈ విషయం మా ఇరువురికీ విచారం కలిగించింది. కొన్ని విషయాలలో ఆయన తొందరపడ్డాడని నాకు అనిపించింది. ఏది ఏమైనా నాశరీరం మీద ఆయనను ప్రయోగాలు చేయనిచ్చాను. బాహ్య చికిత్సే గదా అని భావించాను. ఆయన శరీరమంతా మంచుగడ్డలతో రాయడం ప్రారంభించాడు. ఆయన చికిత్స వల్ల చెప్పినంత ప్రయోజనం కలుగకపోయినా మృత్యువు కోసం మొదట నిరీక్షించినట్లు యిప్పుడు నిరీక్షించడం మానివేశాను. జీవితంమీద ఆశ చిగురించింది. కొద్దిగా ఉత్సాహం కలిగింది. తినే ఆహారం కొద్దిగా పెరిగింది. 10 నిమిషాలపాటు రోజూ పచారు చేయసాగాను. ఆయన నా ఆహారంలో కొద్దిగా మార్పు చేయమని సూచించి “మీరు గ్రుడ్డురసం త్రాగండి. యిప్పటికంటే అత్యధికంగా మీకు ఉత్సాహం కలుగుతుంది. పాల వలెనే గ్రుడ్డు కూడా దోషంలేని వస్తువు. అది మాంసం కానేకాదు. ప్రతి గ్రుడ్డు నుండి పిల్ల పుట్టదు. పిల్లగా మారని గొడ్డుబోతు గ్రుడ్లు కూడా వుంటాయి. వాటిని వాడవచ్చును. నా మాటను రుజూ చేసి చూపిస్తాను” అని మాటల వర్షం కురిపించాడు. కాని అందుకు నేను యిష్టపడలేదు. అయినా నా బండి కొంచెం ముందుకు సాగింది. కొద్ది కొద్దిగా పనులు చేయసాగాను. 

29. రౌలట్ అక్టు - ధర్మసంకటం

మథెరాన్ వెళితే శరీరానికి త్వరగా పుష్టి చేకూరుతుందని మిత్రులు సలహా యిచ్చారు. ఆ ప్రకారం నేను మథెరాన్ వెళ్లాను. అక్కడి నీళ్లు పడలేదు. అందువల్ల నా వంటిరోగి అక్కడ వుండటం కష్టమైపోయింది. ఆమం ఎక్కువ కావడం వల్ల మలద్వారం మెత్తబడిపోయి అక్కడ బాగా గాట్లు పడ్డాయి. దొడ్డికి వెళితే యమబాధ ప్రారంభమైంది. అందువల్ల ఆహారం ఏమన్నా తీసుకుందామంటే భయం వేసింది. ఒక్క వారం రోజుల్లో మథెరాన్ నుండి తిరిగి వచ్చివేశాను. నా ఆరోగ్యాన్ని గురించి శంకరలాల్ శ్రద్ధ వహించాడు. డాక్టర్ దలాల్ సలహా తీసుకోమని వత్తిడి చేశాడు. డాక్టర్ దలాల్ వచ్చారు. వెంటనే నిర్ణయం చేసే ఆయన శక్తి నన్ను ఆకర్షించింది. ‘మీరు పాలు తీసుకోనంత