పుట:సత్యశోధన.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

392

సమైక్యత

ఖ్వాజాగారిని కలుసుకున్నాను. డా. అన్సారీగారిని, డా. అబ్దుల్ రహమాన్ గారలను కూడా కలిశాను. ముస్లిం పెద్దమనుషుల్ని కలుసుకునేందుకు ప్రయత్నిస్తూ వున్నాను. దేశభక్తులు, పవిత్రులునగు వారిని కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. వారు పిలిచిన చోటుకు సందేహించకుండా వెళుతున్నాను.

హిందువులు మహ్మదీయుల మధ్య ఐక్యతలేదని దక్షిణ ఆఫ్రికాలో వున్నప్పుడే గ్రహించాను. ఇరువురి మధ్య గల వివాదాల్ని తొలగించేందుకు అవకాశం చిక్కినప్పుడల్లా గట్టిగా ప్రయత్నిస్తూ వున్నాను. అబద్ధాల పొగడ్తలతో, ఆత్మాభిమానం చంపుకొని ఒకరిని సంతోష పెట్టడం నాకు గిట్టదు. నా అహింసా విధానం వీరిరువురి మధ్య సామరస్యం చేకూర్చునప్పుడు పరీక్షకు గురి అవుతుందని భావించాను. యిప్పటికీ నా అభిప్రాయం అదే. భగవంతుడు ప్రతిక్షణం నన్ను పరిశీలిస్తున్నాడు. నా సత్యశోధన సాగుతూనే వున్నది.

ఇట్టి భావాలతో నేను బొంబాయి రేవులో దిగాను. ఆలీ సోదరులను కలుసుకొని ఎంతో సంతోషించాను. మా స్నేహం పెరుగుతూ వున్నది. మాకు పరిచయం కలిగిన తరువాత ప్రభుత్వంవారు ఆలీ సోదరులను జీవించివుండగనే నిర్జీవులా అన్నంత పని చేశారు. జైలు అధికారుల అనుమతితో మౌలానా మహమ్మద్ ఆలీ పెద్ద పెద్ద ఉత్తరాలు బైతూల్ జైలునుండి, లేక చిందవాడా నుండి నాకు వ్రాస్తూ వుండేవారు. నేను వారిని కలుస్తానని వ్రాసి అనుమతి కోరాను. నాకు అనుమతి లభించలేదు. ఆలీ సోదరులు నిర్బంధించబడిన తరువాత కలకత్తాలో జరిగిన ముస్లింలీగు సమావేశానికి నన్ను ముస్లిం సోదరులు తీసుకు వెళ్లారు. అక్కడ మాట్లాడమని నన్ను కోరారు. అలీ సోదరులను విడిపించడం ముస్లిం సోదరుల కర్తవ్యమని అక్కడ చెప్పాను.

తరువాత వాళ్లు నన్ను ఆలీగఢ్ కాలేజీకి తీసుకువెళ్లారు. అక్కడ ముస్లిం సోదరులను దేశం కోసం ఫకీర్లు కమ్మని ఆహ్వానించాను. ఆలీ సోదరుల విడుదలకై ప్రభుత్వంతో ఉత్తరప్రత్యుత్తరాలు ప్రారంభించాను. యీ సందర్భంలో ఆలీ సోదరుల ఖిలాఫత్ ఉద్యమాన్ని గురించి అధ్యయనం చేశాను. ముస్లిం సోదరులతో చర్చించాను. ముస్లిములకు నిజమైన సోదరునిగా రూపొందదలిస్తే ఆలీ సోదరులను విడుదల చేయించాలని, ఖిలాఫత్ ఉద్యమం న్యాయబద్ధంగా సఫలం కావడానికి కృషి చేయాలని భావించాను.

ఖిలాఫత్ నాకు సులువైన వ్యవహారమే. అందు స్వతంత్రించి గుణదోషాలు చూడవలసిన అవసరంలేదు. ముస్లిం సోదరుల కోరిక నీతి విరుద్ధం కాకపోతే వారికి