పుట:సత్యశోధన.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందుమాట

సత్యాహింసలు మూర్తీభవించి ప్రభవించిన వ్యక్తిగా విశ్వమంతటా ఖ్యాతినొందిన మహాత్మాగాంధీ శతజయంతి ఈ అక్టోబరు, రెండవ (2-వ) తేదీనాడు జరుపుకుంటున్నాం. గాంధీజీ శాంతియుతంగా, ఒక బొట్టు నెత్తురు ఎక్కడా చిందకుండా పోరాడి పరాయి పరిపాలనను అంతమొందించిన జాతీయవీరుడు మాత్రమే కాక, విశ్వమంతటా మానవ సంబంధాలను, అంతర్జాతీయ సహకారాన్ని వ్యాపింపచేసేందుకు శాశ్వత సూత్రాల్ని ప్రవచించిన ధీరుడు. ఉన్నత ఆదర్శాలను పాటించి, ఫలితం పొందేందుకు అనుసరించవలసిన మార్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాటి చెప్పాడు. “ఫలితం వృక్షమైతే, సాధనామార్గం విత్తు. విత్తుకు వృక్షానికి ఉన్న సంబంధమే, సాధనా మార్గానికీ, సాధ్య ఫలితానికీ ఉంది.”[1]

దేశ “స్వరాజ్య” సిద్ధి కొరకై, మహాత్ముడు, తన సిద్ధాంతాల పట్టును వదలలేదు. సత్యపథమే “చివరికి అతిదగ్గర దారి” అయినా చాల దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అని గాఢంగా[2] నమ్మారు మహాత్మాగాంధీ.

ఆయన దృష్టిలో నాగరికతకు సరియైన అర్థం “స్వేచ్ఛగా కోరికలను తగ్గించుకోడమే - వాటిని పెంపు చేసుకొనుట కాదు” [3] “సామాన్య జీవితం, ఉన్నత భావన” అనే ఆదర్శమే ఆయనకు సమ్మతం. కోట్లాది అన్నార్తులకు నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో ఉపాధి కల్పన గురించి ఆయన నొక్కి వక్కాణిస్తూ, ప్రజానీకం యొక్క జీవన స్థాయిని నైతికరంగంతో సహా పెంచడం యింకా ముఖ్యమని ఎప్పుడూ చెప్పేవారు. ఆయన దృష్టిలో “ధనమూ, దానివల్ల అనుభవంలోకి వచ్చే ప్రాపంచిక సుఖాలు కేవలం “ముళ్లమార్గమై” సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అవినీతికి దారితీస్తాయి. “నిజమైన ఆర్థిక ప్రగతి, అత్యున్నతమైన నైతికతకు ఎప్పుడూ విరోధి కాదు.” అనేవారు గాంధీజీ. “బలహీనులను ఎర పెట్టి బలవంతులను పెంచే ధన దాహం సరియైన ఆర్థిక శాస్త్రం కాదు. అది అసత్యం - కుహనాయుతం” అభివృద్ధి చెందిన దేశాలు “ధన మద దుఃఖ జీవనంతో సతమతమవుతున్న రోజుల్లో, క్రొత్త ప్రపంచ నిర్మాణానికి పిలుపునిచ్చి. ఉన్నత ప్రమాణాలే దీనికి దగ్గర దారి అని ఎలుగెత్తి చెప్పడం ఆయన ప్రత్యేకత. లండన్ “న్యూ స్టేట్సమన్” పత్రిక సంపాదకీయంలో - “రొట్టెతో మాత్రమే కాదు” అంటూ, “ప్రపంచంలో నైతిక మార్గాన్ని అనుసరించే దేశాలు ఆకలితో కొట్టుమిట్టాడుతూ

  1. హింద్ స్వరాజ్ - సషజీవన్ - 1962, పుట 71
  2. అమృతబజారు పత్రిక, 17-9-33
  3. యరవాడ మందిరం, నవజీవన్ 1957, పుట 24