పుట:సత్యశోధన.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

370

కేసు ఉపసంహరణ

అందువల్ల కాంగ్రెస్ పేరట రహస్యంగాని, బహిరంగంగా గాని ఏ పనీ చేయలేదు. రాజకుమార్ శుక్లాకు వేలాదిజనంతో కలిసిపోయే శక్తిలేదు. రాజకీయంగా అక్కడ యింతవరకు ఎవ్వరూ పనిచేసి యుండలేదు. చంపారన్ బయటగల ప్రపంచాన్ని ఆయన ఎరుగడు. అయితే మా యిరువురి కలయిక పాతమిత్రుల కలయికగా పరిణమించింది. ఆ రూపంలో నేను దేవుణ్ణి, అహింసను, సత్యాన్నీ దర్శించాను. ఇది అక్షరాలా నిజం. ఈ విషయమై నాకు గల అధికారం ఏమిటి అని ఆలోచిస్తే ప్రేమ తప్ప వేరే ఏమీలేదని ప్రేమ, అహింసల ఎడ నాకు గల నిశ్చలమైన శ్రద్ధ తప్ప మరేమీ లేదని తేలింది.

చంపారన్‌లో జరిగిన ఈ వ్యవహారం నా జీవితంలో మరిచిపోవడానికి వీలులేనిది. అది నాకు, రైతులకు ఉత్సవదినం. ప్రభుత్వ నిర్ణయ ప్రకారం నామీద కేసు నడపబోతున్నది. ఆ కేసు నామీద కాక ప్రభుత్వం మీదనే నడవబోతున్నదన్న మాట. నా కోసం కమీషనరు పరిచిన వలలో ఆంగ్ల ప్రభుత్వమే చిక్కుకోబోతున్నదని వాళ్లు అప్పుడు గ్రహించలేదు. 

15. కేసు ఉపసంహరణ

నా మీద కేసు నడిచింది. గవర్నమెంటు వకీలు, మరియు మేజిస్ట్రేటు కంగారుపడ్డారు. ఏం చేయాలో వారికి పాలుపోలేదు. గవర్నమెంటు వకీలు విచారణను వాయిదా వేయమని ప్రార్ధించాడు. నేను చంపారన్ వదిలివెళ్లమని యిచ్చిన నోటీసుని ఖాతరు చేయలేదు. అపరాధం అంగీకరిస్తున్నాను అని అంటూ నేను వ్రాసుకొచ్చిన క్రింది పాఠాన్ని కోర్టులో చదివి వినిపించాను

“చట్టప్రకారం సెక్షను 144 క్రింద విధించబడ్డ ఆదేశాన్ని ఉల్లంఘించవలసి వచ్చిన కారణాల్ని మీ అనుమతితో క్లుప్తంగా వివరించదలచుకున్నాను. అది నిరాదరణకు సూచకం కాదని మనవి చేస్తున్నాను. యిక్కడి ప్రభుత్వానికి నాకు మధ్య గల అభిప్రాయ భేదమే ఇందుకు కారణం. ప్రజాసేవ ద్వారానే దేశ సేవ చేయడానికి నేను యిక్కడికి వచ్చాను. ఇక్కడి రైతులను యజమానులు సరిగా చూడటం లేదు. అందు నిమిత్తం నన్ను గట్టిగా కోరినందున వారి స్థితిని చూచి సరిచేద్దామనే ఉద్దేశ్యంతో వివరాలన్నీ తెలుసుకుందామని వచ్చాను. నా రాకవలన శాంతి భంగం వాటిల్లుతుందని గాని, రక్తపాతం జరుగుతుందనిగాని నేను భావించడం లేదు. యిట్టి విషయాలలో నాకు మంచి అనుభవం వున్నదని మనవి చేస్తున్నాను. కాని గవర్నమెంటు మరో విధంగా తలుస్తున్నది. ప్రభుత్వానికి గల యిబ్బంది కూడా నేనెరుగుదును.