పుట:సత్యశోధన.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

359

ఖర్చులు పెరిగిపోతూ వున్నా ఆర్థిక సాయం సనాతనుల వల్లే లభిస్తూ వుండేది. అస్పృశ్యత యొక్క మూలం కదిలిపోయిందని అనడానికి అదే నిదర్శనం. యింకా నిదర్శనాలు అనేకం వున్నాయి. అయినా ఒక్క విషయం. అంత్యజులతోబాటు కూర్చొని భోజనాలు చేస్తున్నారని తెలిసి కూడా సనాతనులు ఆశ్రమానికి ఆర్థిక సాయం చేశారు.

ఈ సమస్య మీద ఆశ్రమంలో జరిగిన మరో ఘట్టంతో బాటు ఆ సందర్భంలో బయలుదేరిన సున్నితమైన సమస్యలు, ఊహించని యిబ్బందులు, అన్నీ సత్యశోధన కోసం చేసిన ప్రయోగాలే. వాటినన్నింటిని యిక్కడ ఉదహరించకుండా వదిలి వేస్తున్నందుకు విచారపడుతున్నాను. రాబోయే ప్రకరణాల్లో కూడా యీ విధంగా చేయక తప్పదు. అవసరమైన సత్యాలు వదలవలసి రావచ్చు. అందుకు సంబంధించిన వ్యక్తులు చాలామంది జీవించేయున్నారు. వారి పేర్లు వ్రాస్తే యిబ్బందులు కలుగవచ్చు. అయితే వారి విషయంలో జరిగిన ఘట్టాలు వ్రాసి వారికి పంపడం, వారు అందుకు సమ్మతించి ప్రకటించవచ్చునని అనుమతి యివ్వడం జరిగే పని కాదు. అది ఆత్మకథకు మించినపని. అందువల్ల సత్యశోధనకు సంబంధించినవే అయినా చాలా ఘట్టాల్ని వివరించి వ్రాయడం సాధ్యం కాదని భావిస్తున్నాను. అయినప్పటికి సహాయ నిరాకరణోద్యమ చరిత్ర దాకా భగవంతుడు అనుమతిస్తే వ్రాయలని నా ఆకాంక్ష. 

11. గిరిమిట్ ప్రథ

కొత్తగా స్థాపించబడిన ఆశ్రమం లోపల బయట ఎదుర్కొంటూ పున్న తుఫానుల తీరును గురించి వ్రాయడం ఆపి గిర్‌మిట్ ప్రథను గురించి వ్రాస్తాను. అయిదు సంవత్సరాలు లేక అంతకంటే తక్కువ కాలం మజూరీ తీసుకొని పని చేస్తానని అంగీకరించి పత్రం మీద సంతకం చేసి భారతదేశాన్ని వదిలి దక్షిణ ఆఫ్రికా వెళ్లిన వారిని గిరిమిటియాలని అంటారు. 1914లో అట్టి గిర్‌మిటియాలకు విధించబడ్డ మూడు పౌండ్ల పన్ను రద్దుచేయబడిందే కాని ఆ విధానం యింకా పూర్తిగా రద్దు కాలేదు. 1916లో భారత భూషణ పండిత మదన మోహన మాలవ్యాగారు పెద్ద కౌన్సిలులో యీ విషయం ఎత్తారు. అందుకు సమాధానం యిస్తూ లార్డ్ హార్డింగ్ ప్రభువు వారి ప్రశ్నను అంగీకరించారు. సమయం వచ్చినప్పుడు దీన్ని ఆపుతామని ఆయన అన్నాడు. యీ విధానాన్ని భారతదేశం చాలా కాలం సాగనిచ్చిందని నా అభిప్రాయం. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది కనుక తక్షణం యీ విధానం రద్దు చేయబడాలని నిర్ణయానికి వచ్చి