పుట:సత్యశోధన.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకధ

15


పిల్లలు చెప్పుకునేవారు. ఆ మాటలు నన్ను ఆకర్షించాయి. ఒకసారి ఫారసీ క్లాసులో కూర్చున్నాను అది చూచి సంస్కృత ఉపాధ్యాయుడు చాలా బాధపడ్డాడు. నన్ను పిలిచి “అబ్బాయీ! నీవు ఎవరికొడుకువో ఆలోచించుకో. నీ ధార్మిక భాష సంస్కృతం. దాన్ని నీవు నేర్చుకోవా? సంస్కృతం రాకపోతే నా దగ్గరికి రావచ్చుకదా? శక్తి కొద్దీ పిల్లలకు సంస్కృతం నేర్పడం నా లక్ష్యం. ముందు ముందు సంస్కృతం తేలిక అవుతుంది. అధైర్యపడవద్దు. వచ్చి సంస్కృత క్లాసులో కూర్చో” అని మంచిగా చెప్పాడు.

ఆయన చూపిన మంచితనాన్ని కాదనలేకపోయాను. గురుప్రేమను తిరస్కరించలేకపోయాను. ఆయన పేరు కృష్ణశంకర పాండ్యా, యిప్పుడు వారిని, వారు చెప్పిన పాఠాల్ని గుర్తు చేసుకుంటే నా హృదయం వారి ఉపకారాన్ని మర్చిపోలేక కృతజ్ఞతతో నిండిపోతుంది. ఆనాడు వారిదగ్గర ఆ కొద్దిపాటి సంస్కృతం నేర్చుకొని వుండకపోతే ఆనందించలేకపోయేవాణ్ణి. నిజానికి నేను సంస్కృతం ఇంకా ఎక్కువ నేర్చుకోలేకపోయాననే బాధ యిప్పుడు నాకు కలుగుతూ వుంటుంది. ప్రతి హిందూ బాలుడు, బాలిక సంస్కృతం చక్కగా నేర్చుకోవడం అవసరమని తరువాత గ్రహించాను.

నా అభిప్రాయం ప్రకారం భారతదేశపు ఉన్నత విద్యా ప్రణాళికలో మాతృభాషతో పాటు హిందీ, సంస్కృతం, ఫారసీ, అరబ్బీ, ఇంగ్లీషు భాషలను పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఈ సంఖ్యను చూచి భయపడవలసిన అవసరంలేదు. మనకు బోధించబడుతున్న విద్యను క్రమబద్ధం చేసి పరాయి భాషలో పాఠ్యాంశాలు నేర్చుకోవలసిన అవసరం లేకుండా చేసి, ఆ భారం తగ్గించితే పిల్లలు తేలికగా ఈ భాషలు నేర్చుకోగలుగుతారని. వాళ్ళకు ఆనందం కలుగుతుందని నా అభిప్రాయం. ఒక భాషను శాస్త్రీయంగా అభ్యసిస్తే మిగతా భాషలు సులభతరం అవుతాయి. అసలు హిందీ, గుజరాతీ, సంస్కృత భాషలు ఏకభాషలేనని చెప్పవచ్చు. అదే విధంగా ఫారసీ, అరబ్బీ భాషలు ఏకభాషలే. ఫారసీ భాష ఆర్య భాషకు చెందినది. అరబ్బీ భాష హీబ్రూకు చెందినది. అయినా ఈ రెండింటికీ దగ్గరి చుట్టరికం వుంది. ఈ రెండు భాషలు ఇస్లాం మతంతోబాటు అభివృద్ధి చెందాయి. ఉర్దూ భాష వేరు అని నేను అంగీకరించను. హిందీ వ్యాకరణాంశాలు అందు వుండటం, ఫారసీ, అరబ్బీ పదాలు అందు వుండటం అందుకు కారణం. గుజరాత్, హిందీ, బెంగాలీ, మరాఠీ, మొదలుగా గల మన భాషల్లో మంచి ప్రవేశం కలగాలంటే సంస్కృతం నేర్చుకోవడం చాలా అవసరం. అలాగే ఉర్దూలో మంచి ప్రవేశం కలగాలంటే ఫారసీ, అరబ్బీ భాషలు అభ్యసించాలి.