పుట:సత్యశోధన.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

344

శాంతినికేతనం

వచ్చారు. గురుదేవుని దాకా యీ విషయం వెళ్లింది. వారు కొద్ది సేపు యోచించి ఉపాధ్యాయులు అంగీకరిస్తే అమలు పరచడం మంచిదేనని అన్నారు. ఇది క్రొత్త ప్రయోగం. స్వరాజ్యప్రాప్తికి తాళంచెవి యిందు నిహితమై వున్నది అని గురుదేవులు విద్యార్థులకు చెప్పారు.

పియర్సన్ యీ ప్రయోగాన్ని విజయవంతం చేయుటకు అపరిమితంగా కృషి చేశారు. వారికి యీ పని బాగా నచ్చింది. కూరలు తరిగేందుకు ఒక బృందం ఏర్పడితే తిండిగింజలు శుభ్రం చేసేందుకు మరో బృందం ఏర్పడింది. వంట యింటి పారిశుద్ధ్యానికి నగేన్‌బాబు ఆధ్వర్యంలో కొందరు పూనుకున్నారు. పారలు పుచ్చుకొని వారంతా వంటి యింటిని పరిసరాల్ని బాగుచేస్తుంటే నాహృదయం సంతోషంతో పొంగిపోయింది. ఇది దరిదాపు వందమందికి పైగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక్కసారిగా ఠపీమని చేసేపని కాదు. కొందరికి అలసట కలిగింది. కాని చేసే పనికి ఆయన పూనుకున్నారు. అంట్లు తోముతున్న వారి అలసటను పోగొట్టి వారికి ఆహ్లాదం కలిగించేందుకై కొందరు సితారు వాయిస్తూ వుండేవారు. మొత్తం పనులన్నీ స్వయంగా చేసేందుకు విద్యార్థులు పూనుకున్నారు.

శాంతినికేతం తేనెటీగల తుట్టెలా తళతళ మెరిసిపోయింది. ఇటువంటి మార్పులు ఆగిపోకూడదు. ఫినిక్సు ఆశ్రమంలో మేము ప్రారంభించిన భోజనశాల స్వయంపోషకమై మంచిగా సాగింది. అందు సాదా భోజనం లభిస్తూ వుండేది. మసాలాల వాడకం తగ్గించి వేశాము. ఆవిరితో అన్నం, పప్పు, కూరలు గోధుమతో తయారయ్యే వస్తువులు తయారయ్యేవి.

తరువాత శాంతినికేతనంలో కొన్ని కారణాల వల్ల యీ ప్రయోగం ఆగిపోయింది. ప్రపంచ ఖ్యాతి బడసిన యీ సంస్థలో కొద్దిరోజుల పాటు యీ ప్రయోగం సాగినా సంస్థకు ఎంతో మేలే చేకూరిందని చెప్పవచ్చు. ఇంకా కొద్దిరోజులు శాంతినికేతనంలో వుందామని అనుకున్నాను. కాని సృష్టికర్త నన్ను అక్కడ వుండనీయలేదు. వారం రోజులు మాత్రమే వున్నాను. యింతలో పూనాలో గోఖలేగారు పరమపదించారని సమాచారం అందింది. శాంతినికేతనం విచారసాగరంలో మునిగిపోయింది. తమ విచారం ప్రకటించేందుకు అంతా నా దగ్గరకు రాసాగారు. దేవళంలో ప్రత్యేక సభ జరిగింది. వాతావరణం గంభీరంగా వుంది. ఆనాడు సాయంత్రమే నేను పూనాకు బయలుదేరాను. నా భార్య మరియు మగన్‌లు నాతోబాటు వున్నారు. మిగతావారంతా శాంతినికేతనంలో వుండిపోయారు.