పుట:సత్యశోధన.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

332

కక్షిదారులు అనుచరులుగా మారారు

ఈ విధమైన తర్కంతో ప్రతి పక్షానికి చెందిన వకీలును శాంతపరిచి పొరపాటును సరిచేసి లేక యీ చిన్న పొరపాటును సరిదిద్ది మళ్ళీ తీర్పు యిమ్మని పంచాయితీ దారుల్ని ఆదేశించి, కోర్టు సరిదిద్దబడిన తీర్పును ఖాయం చేసింది. నేను ఎంతో సంతోషించాను. కక్షిదారు మరియు పెద్ద వకీలుకూడా సంతోషించారు. వకీలు వృత్తిలో కూడా సత్యరక్షణ కావిస్తూ పని చేయవచ్చుననే నా అభిప్రాయం దృఢపడింది.

వృత్తి కోసం చేసే వకాల్తాలో దోషం వుంటే, దాన్ని సత్యం కప్పి వుంచలేదని పాఠకులు గ్రహింతురుగాక. 

46. కక్షిదారులు అనుచరులుగా మారారు

నేటాలు మరియు ట్రాన్సువాలుల వకాల్తాలో ఒక తేడా వున్నది. నేటాలులో అడ్వొకేట్‌కు మరియు అటార్నికి తేడా వున్నప్పటికి యిద్దరూ కోర్టులన్నింటియందు సమానంగా వకాల్తాకు పూనుకోవచ్చు. ట్రాన్సువాలులో బొంబాయి వలెనే వ్యవహారం సాగుతున్నది. అక్కడ కక్షిదారుకు సంబంధించిన వ్యవహారాలన్నీ అడ్వొకేట్ అటర్ని ద్వారానే జరుగుతాయి. నేటాలులో నేను అడ్వకేట్‌గా ధృవీకరణ పత్రం తీసుకున్నాను. ట్రాన్సువాలులో అటార్నీ పత్రం పుచ్చుకున్నాను. అడ్వొకేట్‌గా వుంటూ హిందు దేశస్థులతో నాకు తిన్నగా సంబంధం వుండదు. తెల్లవాడైన అటార్నీ నాకు కేసులు అప్పగించే స్థితి దక్షిణ ఆఫ్రికాలో లేదు. ట్రాన్సువాలులో వకాల్తా చేస్తూ మేజిస్ట్రేటు కోర్టుకు నేను చాలా సార్లు వెళ్ళాను. ఒక పర్యాయం విచారణలో వున్న ఒక కేసులో నా కక్షిదారు నన్ను మోసం చేశాడని తేలింది. అతని కేసు అబద్ధాల పుట్ట. అతడు బోనులో నిలబడి వణికిపోయాడు. పడిపోయే స్థితిలో వున్నాడు. నేను మేజిస్ట్రేటును “అయ్యా. నా కక్షిదారుకు కఠిన శిక్ష విధించండి” అని కోరి కూర్చున్నాను. ప్రతిపక్షానికి చెందిన వకీలు నివ్వెరబోయాడు. మేజిస్ట్రేటు సంతోషించాడు. కక్షిదారును నేను బాగా కోప్పడ్డాను. ముందుగనే అబద్ధం కేసుతీసుకోనని అతడికి గట్టిగా చెప్పాను. అతడు అందుకు అంగీకరించాడు కూడా. అందువల్ల అతడికి శిక్షవిధించమని కోరినందున అతడు కోపం తెచ్చుకోలేదు. ఏదిఏమైనా నా యీ వ్యవహార ప్రభావం నా వృత్తిమీద పడలేదు. కోర్టులో నా పని సులభమైపోయింది. సత్యనిష్టవల్ల వకీలు మిత్రుల దృష్టిలో నాకు గౌరవం పెరిగింది. వారందరి ఆదరణ పొందగలిగాను. వకీలు వృత్తి సాగిస్తున్నప్పుడు కక్షిదారు దగ్గర గాని, వకీలు దగ్గర గాని నా అజ్ఞానాన్ని దాచేవాణ్ణికాదు. నాకు బోధపడనప్పుడు మరో వకీలు దగ్గరకు వెళ్ళమని కక్షిదారుకు నేనే సలహా యిచ్చేవాణ్ణి.