పుట:సత్యశోధన.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

312

ఉపవాసం

36. ఉపవాసం

బాలురు, బాలికలు యిద్దరినీ నిజాయితీగా పోషించడం, వారికి విద్య గరపడం ఎంత కష్టమైన పనో నాకు రోజురోజుకూ బోధపడసాగింది. ఉపాధ్యాయుడుగా, సంరక్షకుడుగా వారి హృదయాల్లోకి ప్రవేశించాలి. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. వారి జీవిత సమస్యల్ని పరిష్కరించాలి. వారి యౌవ్వనవికాస తరంగాల్ని సరియైన మార్గానికి తరలించాలి. జైళ్లలో ఉన్న ఖైదీలు కొందరు విడుదలైనందున ఆశ్రమంలో కొద్దిమంది మాత్రమే మిగిలారు. వారంతా ఫినిక్స్‌వాసులు. అందువల్ల ఆశ్రమాన్ని ఫినిక్సుకు తీసుకుని వెళ్లాను. ఫినిక్సులో నాకు కఠినపరీక్ష జరిగింది. టాల్‌స్టాయ్ ఆశ్రమంలో మిగిలిన వారిని ఫినిక్సుకు జేర్చి నేను జోహాన్సుబర్గు వెళ్లాను. జోహాన్సుబర్గులో కొద్దిరోజులు ఉన్నానో లేదో ఇంతలో ఇద్దరు వ్యక్తులు భయంకరంగా పతనం చెందారను వార్త నాకు చేరింది. సత్యాగ్రహ సంగ్రామంలో ఎక్కడైనా వైఫల్యం కలిగితే నాకు ఇంత బాధకలిగించదు కాని యీ వార్త వినగానే నా మీద పిడుగు పడినట్లని పించింది. నా మనస్సుకు గట్టి దెబ్బ తగిలింది. ఫినిక్సుకు బయలుదేరాను. మి.కెలెన్‌బెక్ వెంటవస్తానని పట్టుబట్టారు. వారు నా దయనీయస్థితిని గ్రహించారు. వంటరిగా వెళ్ళనీయనని పట్టుబట్టారు. పతనవార్త వారి ద్వారానే నాకు అందింది.

త్రోవలో నా కర్తవ్యం ఏమిటా అని యోచించాను. ఎవరి సంరక్షణలో వుంటూ వ్యక్తులు చెడిపోతారో ఆ సంరక్షకులు కూడా కొంతవరకు అందుకు బాధ్యులే అని భావించాను. నా బాధ్యత కూడా నాకు బోధపడింది. గతంలో నా భార్య నన్ను హెచ్చరించింది కూడా. కాని సహజంగా అందరినీ నమ్మే మనిషిని గనుక ఆమె మాటల్ని నేను పట్టించుకోలేదు. అందుకు గాను నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయాన్ని అమలుపరిస్తే తప్పుజేసినవారు తమ తప్పేమిటో తెలుసుకుంటారని భావించాను. ఆ ప్రకారం నేను ఏడురోజులు ఉపవాసం చేయాలని నాలుగున్నర మాసాలు ఒక పూట భోజనం చేయాలని నిర్ణయించుకున్నాను. మి. కేలన్‌బెక్ నన్ను ఆపాలని ప్రయత్నించారు. కాని నేను ఒప్పుకోలేదు. చివరికి ఆయన నా నిర్ణయాన్ని ఒప్పుకుని తానుకూడా అలాగే చేస్తానని అన్నారు. నిర్మలమైన వారి ప్రేమను నేను కాదనలేక పోయాను. ఈ విధంగా నిర్ణయానికి వచ్చిన తరువాత నాకు బరువు తగ్గినట్లనిపించింది. మనస్సు కుదుటపడింది. దోషుల మీద కోపం తగ్గిపోయింది. వారిమీద కేవలం దయ మాత్రమే మిగిలింది.