పుట:సత్యశోధన.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

304

గురువుగా

నా ఉపవాసాలను గురించి వ్రాస్తూ ఇతర విషయాలు కావాలనే ఇక్కడ పేర్కొన్నాను. ఇంతటి తీయని విషయాలు తెలిపేందుకు మరోచోట అవకాశం లభించకపోవడమే అందుకు కారణం. నాకు ఇది సబబు అని తోచిన విషయాలపై అనుచరుల సమ్మతి కూడా పొందుతూ వుండేవాణ్ణి. ఇది నా ప్రవృత్తిగా మారింది. ఉపవాసాలు, ఒకపూట భోజనాలు అందరికీ క్రొత్త. అయినా నేను ఆ విధుల్ని అమలుపరచగలగడం విశేషం.

ఈవిధంగా ఆశ్రమంలో సంయమ వాతావరణం సహజంగా ఏర్పడింది. ఉపవాసాల వల్ల ఒకపూట భోజనాలవల్ల సత్ఫలితాలు కలిగాయి. ఆశ్రమవాసులందరి మీద వీటి ప్రభావం ఏ పరిమాణంలో పడింది అని అడిగితే స్పష్టంగా చెప్పడం కష్టం. అయితే ఆరోగ్యరీత్యానేగాక, విషయవాంఛల రీత్యా కూడా నాలో పెద్ద మార్పు వచ్చిందని చెప్పగలను. ఇట్టి ప్రభావం అందరి మీద పడిందా అని అడిగితే చెప్పడం కష్టం. విషయ వాంఛలు అణగి ఇంద్రియ నిగ్రహం కలగాలంటే అందుకు ప్రత్యేకించిన ఉపవాసాలు అవసరం. అయితే ఇలాంటి ప్రయోగం చేస్తున్నప్పుడు కోరికలు తీవ్రం అవుతాయని కొందరికి కలిగిన అనుభవం. అసలు అన్నిటికీ మూలం మసస్సు. ఆ మనస్సును కంట్రోలులో పెట్టుకోకుండా శారీరకంగా ఎన్ని ఉపవాసాలు చేసినా, వ్రతాలు ఆచరించినా ఫలితం ఉండదు. గీతయందలి ద్వితీయ అధ్యాయమందు గల క్రింది శ్లోకం పరిశీలించదగినది.

“విషయావినివర్తన్తే నిరాహారస్య దేహినః రసవర్జరస్యోప్యస్యపరం దృష్ట్వా నిర్తతే”

అనగా నిరాహారియైనవానికి శబ్దాది విషయముల ఒత్తిడి తగ్గును. కాని విషయవాసన మిగిలియే ఉండును. అది పరమాత్మ దర్శనమువల్ల తొలగును.

సారాంశమేమనగా ఉపవాసాదులు సంయమానికి సాధనాల రూపంలో అవసరం. కాని అదే సర్వస్వం మాత్రం కాదు. శరీరరీత్యా ఉపపాసాలతోబాటు మనస్సు రీత్యా ఉపవాసాలు చేయకపోతే అది దంభానికి కారణభూతం అవుతుంది. అది హాని కూడా కలిగించవచ్చు. 

32. గురువుగా

దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్రలో విస్తారంగా వ్రాయకుండా కొద్దిగా వ్రాసిన విషయం యిక్కడ పేర్కొంటున్నందున రెండింటి సంబంధం పాఠకులు గ్రహింతురుగాక.