పుట:సత్యశోధన.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

9

తెలుసు? నేర్చుకున్న పాఠాలు జ్ఞాపకం వుంటాయా? అసలు అవి ఒకరి దగ్గర నేర్చుకునే విషయాలా? సంస్కారాలు బలంగా వున్నచోట పాఠాలు పనిచేయవు. మెల్లమెల్లగా ఒకరినొకరు అర్థం చేసుకోసాగాం. మాట్లాడుకోసాగాం. మేమిద్దరం సమవయస్కులం. అయినా భర్తగా అధికారం చలాయించడం ప్రారంభించాను.

4. భర్తగా

నాకు పెండ్లి అయిన రోజుల్లో దమ్మిడీకో, కాణీకో, చిన్న చిన్న పత్రికలు అమ్ముతూ వుండేవారు. వాటిలో భార్యభర్తల ప్రేమ, పొదుపు, బాల్యవివాహాలు మొదలుగా గల విషయాలను గురించి వ్రాస్తూ వుండేవారు. చేతికందినప్పుడు వాటిని పూర్తిగా చదివేవాణ్ణి. నచ్చని విషయాల్ని మరిచిపోవడం, నచ్చిన విషయాల్ని ఆచరణలో పెట్టడం నాకు అలవాటు. ఒకసారి ఒక పత్రికలో ఏకపత్నీవ్రతం ధర్మం అను వ్యాసం ప్రకటించారు. శ్రద్ధగా చదివాను. ఆ విషయం నా మనస్సులో నాటుకుపోయింది. సత్యమంటే నాకు మక్కువ, అట్టి స్థితిలో భార్యను మోసగించడం నావల్ల సాధ్యం కానిపని. అందువల్ల మరో స్త్రీ యెడ మక్కువ కూడదని నాకు బోధపడింది. చిన్న వయస్సులో ఏకపత్నీవ్రత భంగం అయ్యే అవకాశం తక్కువేనని చెప్పవచ్చు.

కాని ఒక ముప్పు కూడా కలిగింది. నేను ఏకపత్నీవ్రతం అవలంబించితే ఆమె కూడా పాతివ్రత్యాన్ని పాటించాలి. యీ రకమైన యోచన నన్ను ఈర్ష్యపడే భర్తగా మార్చివేసింది. పాటించాలి అని అనుకున్న నేను “పాటింపచేయాలి” అనే నిర్ణయానికి వచ్చాను. ఆమెచే పాటింపచేయాలంటే నేను జాగ్రత్త పడాలి అని భావించాను. నిజానికి నా భార్యను శంకించవలసిన అవసరం లేనేలేదు. కానీ అనుమానం పెనుభూతం వంటిది కదా. నా భార్య ఎక్కడికి పోతున్నదీ నేను తెలుసుకోకపోతే ఎలా? నా అనుమతి లేనిదే ఆమె ఎక్కడికీ వెళ్ళకూడదు. దానితో మా మధ్య ఎడమొహం పెడమొహం ప్రారంభమైంది. అనుమతి లేకుండా ఎక్కడికీ పోకూడదంటే ఒక విధమైన జైలేకదా! అయితే కస్తూరిబాకి యిలాంటి జైలు బంధాలు గిట్టవని తేలిపోయింది. నేను వెళ్ళొద్దని వత్తిడి తెచ్చిన కొద్దీ వెళ్ళసాగింది. దానితో నాకు చిరచిర ఎక్కువైంది. పిల్లలమైన మా మధ్య మాటలు కూడా ఆగిపోయాయి. కస్తూరిబా తీసుకున్న స్వాతంత్ర్యం నిజానికి దోషరహితం. మనస్సులో ఏ విధమైన దోషం లేని బాలిక దైవదర్శనానికో, మరెవరినైనా కలుసుకోవడానికో వెళ్ళడాన్ని అంగీకరించక అధికారం చెలాయిస్తే సహిస్తుందా? నేను ఆమె మీద దర్పం చూపిస్తే ఆమె కూడా నా మీద దర్పం చూపించవచ్చుకదా! అయితే యీ విషయం కాలం గడిచాక బోధపడింది కానీ అప్పుడో! భర్తగా అధికారం చలాయించడమే నా పని.