పుట:సత్యశోధన.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

289

చేయడం మాత్రమే. మేము ఆ పనికి పూనుకొని వుండకపోతే మరొకరెవ్వరూ ఆ పని చేసి ఉండేవారు కాదు. ఈ విధంగా చెప్పుకొని నా అంతరాత్మను శాంతపరచుకున్నాను.

ఇక్కడ జనసంఖ్య చాలా తక్కువ. పర్వతాలమీద, కొండచరియల్లోను, అమాయకులు, మంచివాళ్ళు, అడవి మనుష్యులుగా భావించబడే జూలూల గుండ్రంగా గోపురాల రూపంలో ఉండే కొద్ది గుడిసెలు తప్ప మరేమీ లేవు. అక్కడి దృశ్యాలు భవ్యంగా ఉన్నవి. ఇలాంటి జనసంచారం లేని చోట క్షతగాత్రుల్ని మోసుకొని తీసుకువెళ్ళవలసి వచ్చినప్పుడు నేను విచార సాగరంలో మునిగిపోతూ ఉండేవాణ్ణి.

ఇక్కడే బ్రహ్మచర్యాన్ని గురించిన భావాలు నాలో పరిపక్వమయ్యాయి. నా అనుచరులతో కూడా కొద్దిగా ఈ విషయం చర్చించాను. ఈశ్వర సాక్షాత్కారానికి బ్రహ్మచర్యం అవసరమని నాకు అనుభూతి కలగలేదు. కాని సేవ చేయటానికి అవసరమని నాకు స్పష్టంగా బోధపడింది. ఈ విధమైన సేవ చేయవలసిన సందర్భాలు విస్తారంగా వస్తాయని, నేను భోగవిలాసాల్లో పడి, పిల్లల్ని కంటూ వాళ్ళ పోషణలో లీనమై ఉంటే సేవాకార్యం సరిగా చేయలేనని గ్రహించాను. బ్రహ్మచర్య వ్రతానుష్ఠానం కావించకుండా జనాన్ని పెంచుకుపోతే సాంఘిక ప్రగతికోసం చేసే మానస కృషి క్రుంగి పోతుందని తెలుసుకున్నాను. వివాహం చేసుకొని కూడా బ్రహ్మచర్య వ్రతం సాగించితే కుటుంబ సేవ, సమాజ సేవ కుంటుబడదని భావించాను. ఈ రకమైన భావతరంగాల్లో తేలియాడుతూ ఎప్పుడెప్పుడు బ్రహ్మచర్యవ్రతానికి పూనుకుందామా అని తపన పడిపోయాను. ఈ రకంగా ఆలోచించడం వల్ల నాకు ఆనందం కలిగింది. ఉత్సాహం పెరిగింది. ఈ కల్పన నా సేవారంగాన్ని విశాలం చేసింది.

ఈ భావాలకు మనస్సులో రూపకల్పన చేస్తూ ఉండగా, ఇంతలో ఒకరు తిరుగుబాటు శాతించిందని, ఇక మనం వెళ్ళవచ్చునని వార్త అందజేశారు. మర్నాడు మీరు ఇళ్ళకు వెళ్ళిపోవచ్చునని మాకు ఆదేశం అందింది. కొద్దిరోజులకు ఎవరి ఇండ్లకు వారు చేరుకున్నారు. మా సేవాకార్యాన్ని అభినందిస్తూ గవర్నరు నాకు కృతజ్ఞతా పత్రం పంపించాడు.

ఫినిక్సు చేరుకొని బ్రహ్మచర్యాన్ని గురించి మగన్‌లాలుకు, ఛగన్‌లాలుకు, వెస్ట్ మొదలుగాగల వారికి ఉత్సాహంతో వివరించి చెప్పాను. అందరికీ నా అభిప్రాయం నచ్చింది. అంతా అందుకు అంగీకరించారు. అయితే ఆచరణకు సంబంధించిన ఇబ్బంది అందరి దృష్టికి వచ్చింది. అందరూ ఈ విషయమైన కృషి ప్రారంభించారు. చాలావరకు విజయం సాధించారు. ఇప్పటి నుండి జీవించి వున్నంత వరకు బ్రహ్మచర్య