పుట:సత్యశోధన.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

269

17. లొకేషను దగ్ధం

ప్లేగుకు సంబంధించిన పనుల నుండి ముక్తి పొందామేకాని అందుకు సంబంధించిన మిగతా వ్యవహారాలు యింకా మమ్మల్ని వదలలేదు. లొకేషను పరిస్థితిని గురించి మునిసిపాలిటీ పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కాని తెల్లవారి ఆరోగ్యం విషయంలో మాత్రం పూర్తిగా పట్టించుకొని ఇరవైనాలుగు గంటలు జాగ్రత్త వహించింది. తెల్లవారి ప్రాంతాలకు వ్యాధి ప్రాకకుండా వుండేందుకు డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టింది. హిందూ దేశస్థులను గురించి గాని, వాళ్ల ఆరోగ్యాన్ని గురించి గాని పట్టించుకోని దోషాలు మునిసిపాలిటీ వారిలో చూచాను. అయితే తెల్లవారి ఆరోగ్యం విషయమై వారు చూపిన శ్రద్ధను అభినందించకుండా వుండలేకపోయాను. ఈ విషయమై చేయగలిగినంత సాయం నేను చేశాను. నేను ఆ సాయం చేసియుండకపోతే మునిసిపాలిటీ వారు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళే. గుండ్లవర్షం కురిపించో, తుపాకుల సాయం పొందో తమ నిర్ణయాలను అమలుచేసి యుండేవారు.

అయితే అలా జరగలేదు. హిందూదేశస్థులు వ్యవహరించిన తీరుకు వాళ్ళు ఎంతో సంతోషించారు. తత్ఫలితంగా తరువాత పనులు సవ్యంగా జరిగాయి. మునిసిపాలిటీ వారి పనులు హిందూ దేశస్థుల ద్వారా చేయించడానికి నా పలుకుబడి ఉపయోగపడింది. నా వత్తిడి లేకపోతే హిందూ దేశస్థులు ఆ పనులు చేసేవారు కాదు.

లొకేషనుకు నలువైపుల కాపలా పెట్టారు. అనుమతి లేకుండా లోపలికి ఎవ్వరూ పోగూడదు, బయటికి రాకూడదు. నాకు, నా అనుచరులకు లోపలికి వెళ్ళడానికి, బయటకు రావడానికి పర్మిట్ ఇచ్చారు. లొకేషనులో నివసిస్తున్న హిందూ దేశస్థులనందరినీ జోహన్సుబర్గుకు 13 మైళ్ళ దూరాన మైదానంలో డేరాలు వేసి వాటిలో వుంచాలని, ఆ తరువాత లొకేషనును దగ్ధం చేయాలని మునిసిపాలిటీవారు నిర్ణయించారు. అక్కడకు వెళ్ళి డేరాల్లో కుదుటపడటానికి కొంత సమయం పట్టింది. అందాకా కాపలా ఏర్పాటు అలాగే ఉంచారు.

జనం భయపడ్డారు. అయితే నేను వాళ్ళవెంట వున్నాననే ధైర్యం వాళ్ళకు వున్నది. చాలామంది తమ డబ్బు భూమిలో గుంట తవ్వి దాచుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బు బయటకి తీయవలసి వచ్చింది. వాళ్ళకు బ్యాంకుల విషయం తెలియదు. నేను వారికి బ్యాంకు అయ్యాను. నా దగ్గర వాళ్ళందరి సొమ్ము కుప్పలుగా చేరింది. ఆ సొమ్ములో నేను కమీషను తీసుకునే సమస్యే లేదు. వాళ్ళ డబ్బు సమస్యను