పుట:సత్యశోధన.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివాహమంటే ప్రధానం కాదు. ఇద్దరు బాలబాలికలకు పెండ్లి జరపాలని వాళ్ళ తల్లిదండ్రులు చేసుకునే నిర్ణయాన్ని లేక ఒడంబడికను ప్రధానం అని అంటారు. ప్రధానం అనుల్లంఘనీయం కాదు. ప్రధానం అయిన తరువాత పెండ్లికి పూర్వం పిల్లవాడు చనిపోతే ఆ బాలిక వితంతువైపోదు. ప్రధానానికి సంబంధించినంతవరకు వరుడికి, వధువుకి మధ్య సంబంధం ఉండదు. అసలు తమకిరువురికీ ప్రధానం జరిగిందను విషయం కూడా వాళ్ళకు తెలియదు. ఈ విధమైన ప్రధానాలు నాకు వరుసగా మూడు జరిగాయని విన్నాను. అవి ఎప్పుడు జరిగాయో నాకు తెలియదు. ప్రధానం జరిగిన తరువాత ఇద్దరు కన్యలు చనిపోయారని నాకు చెప్పారు. మూడో ప్రధానం ఏడేండ్ల వయస్సులో జరిగినట్లు నాకు గుర్తు. అయితే ప్రధానం జరిగినప్పుడు నాకు ఎవరైనా ఏమైనా చెప్పారో లేదో గుర్తులేదు. పెండ్లి జరిగినప్పుడు వరుడు, వధువు అవసరం అవుతారు. కొన్ని విధులు వారు నిర్వర్తించవలసి వుంటుంది. అట్టి వివాహాన్ని గురించే వ్రాస్తున్నాను. నా పెండ్లికి సంబంధించిన కొన్ని వివరాలు నాకు గుర్తు వున్నాయి.

మేము ముగ్గురు అన్నదమ్ములమని పాఠకులకు గతంలో తెలియజేశాను. మాలో అందరికంటే పెద్దవాడికి పెండ్లి అయిపోయింది. రెండవవాడు నా కంటె రెండు మూడు సంవత్సరాలు పెద్ద. అతడికీ, వయుస్సులో నా కంటే ఒకటి లేక ఒకటిన్నర సంవత్సరం పెద్దవాడైన మా పినతండ్రి చివరికొడుక్కి, నాకు ముగ్గురికీ ఒకేసారి పెండ్లి జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఈ విషయంలో మా మేలును ఎవ్వరూ ఆలోచించలేదు. మా యిష్టాయిష్టాలను గురించి యోచించే అవకాశమే లేదు. పెద్దవాళ్ళు తమ సౌకర్యం గురించి, పెండ్లి ఖర్చులు తగ్గించడాన్ని గురించి మాత్రమే యోచించారు.

హిందూ సమాజంలో వివాహమంటే సామాన్య విషయం కాదు. వరుడు, వధువుల తల్లిదండ్రులు ఆర్థికంగా తరచు కూలిపోతూ వుంటారు. డబ్బును, సమయాన్ని వ్యర్థం చేస్తారు. పెండ్లి ఏర్పాట్లు ఎన్నో నెలల ముందునుంచే ప్రారంభిస్తారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు సమకూరుస్తారు. విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తారు. పిండి వంటల విషయంలో పోటాపోటీలు ప్రారంభమవుతాయి. కంఠం సరిగా వున్నా లేకపోయినా లెక్క చేయకుండా స్త్రీలు పాటలు పాడి పాడి గొంతు పోగొట్టుకుంటారు. జబ్బు కూడా పడతారు. ఇరుగుపొరుగువాళ్ళ శాంతికి భంగం కలిగిస్తారు. అయితే ఇరుగుపొరుగువాళ్ళు కూడా తమ ఇళ్ళలో శుభకార్యలు జరిగినప్పుడు ఇలాగే చేస్తారు.