పుట:సత్యశోధన.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

256

ఇంగ్లీషు వారితో పరిచయం

గుమస్తా పనికి ఇంగ్లీషు వాళ్ళు దొరికితే వారిని నియమించకుండా ఎలా వుండగలను? నల్లవారి దగ్గర తెల్లవాళ్ళు ఉద్యోగం చేస్తారా అని నాకు అనుమానంగా వుండేది. ప్రయత్నం చేసి చూద్దామని నిర్ణయించుకున్నాను. టైపు రైటింగు ఏజెంట్లతో నాకు పరిచయం ఉంది. ఒక ఏజెంటు దగ్గరకు వెళ్లాను. టైపు చేయగల తెల్లవారు స్త్రీ అయినా పురుషుడైనా నల్లవారి దగ్గర నౌకరీ చేయడానికి అంగీకరిస్తే పంపండి అని ఆయనకు చెప్పాను. దక్షిణ ఆఫ్రికాలో షార్టుహాండు, టైపురైటింగు పని సామాన్యంగా స్త్రీలే చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తిని వెతికి పంపిస్తానని ఆయన మాట ఇచ్చాడు. ఆయనకు మిస్‌డిక్ అను పేరుగల ఒక స్కాచ్‌కుమారి తటస్థపడింది. ఆ మహిళ ఈ మధ్యనే స్కాట్లండు నుండి వచ్చింది. ప్రామాణికమైన నౌకరీ ఎవరి దగ్గరనైనా సరే చేయడానికి ఆమెకు అభ్యంతరం లేదు. ఆమె వెంటనే పనిలో చేరాలని అనుకున్నది. ఆ ఏజంటు ఆమెను నా దగ్గరకు పంపించాడు. చూడగానే ఆమె మీద నా దృష్టి నిలబడిపోయింది.

‘హిందూ దేశవాసి దగ్గర పనిచేయడానికి మీకు అభ్యంతరం ఏమీ లేదు కదా!’ అని అడిగాను. “ఏమాత్రం లేదు” దృఢమైన స్వరంతో ఆమె అన్నది.

“జీతం ఎంత కావాలి?”

“పదిహేడున్నర పౌండ్లు. మీరు ఎక్కువ అనుకుంటున్నారా?” అని ఆమె అడిగింది

“నేను ఆశించినంత పని మీరు చేసిన యెడల ఆ సొమ్ము నాకు అధికం కాదు. మీరు ఎప్పటి నుండి పనిలో చేరతారు?”

“మీరు సరేనంటే ఈ క్షణం నుంచే పని ప్రారంభిస్తాను.”

నేను ఎంతో సంతోషించాను. ఆ సోదరిని వెంటనే ఎదుట కూర్చోబెట్టుకుని జాబులు వ్రాయించడం ప్రారంభించాను.

ఆమె ఒక గుమాస్తాగా గాక, ఒక బిడ్డగా, ఒక సోదరిగా బాధ్యత వహించి పనిచేయడం ప్రారంభించింది. ఆమెకు ఎన్నడూ బిగ్గరగా చెప్పవలసిన అవసరం కలుగలేదు. ఆమె చేసిన పనిలో తప్పులెన్నవలసిన అవసరం ఎన్నడూ కలుగలేడు. వేలాది పౌండ్ల సొమ్ము ఆమె చేతిలో వున్న రోజులు కూడా వున్నాయి. ఆమె డబ్బు లెక్క కూడా సంబాళించసాగింది. సంపూర్తిగా ఆమె నా విశ్వాసాన్ని చూరగొన్నది. ఆమె వ్యక్తిగత రహస్యాలు కూడా నాకు చెప్పే స్థితికి రావడం ఎంతో గౌరవంగా భావించాను. తనకు తోడుగా వుండే వ్యక్తిని గురించిన సలహా అడగడమే గాక నా సాయం కూడా