పుట:సత్యశోధన.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

మళ్లీ దక్షిణ-ఆఫ్రికా

వగైరాలు సముద్రానికి దూరమని అనిపించింది. శాంతాకృజ్‌లో ఒక అందమైన బంగళా దొరికింది. అక్కడ కాపురం పెట్టాను. ఆరోగ్యదృష్ట్యా సురక్షితం అని భావించాను. చర్చిగేటు వరకు వెళ్లడానికి ఒక మొదటి తరగతి రైలు పాసు తెప్పించుకున్నాను. మొదటి తరగతి బండిలో అనేక పర్యాయాలు నేనొక్కడినే ప్రయాణించినట్లు గుర్తు. అందువల్ల నాకు కొంచెం గర్వంకూడా కలిగింది. చాలాసార్లు బాంద్రానుండి చర్చిగేటుకు సరాసరి వెళ్లే బండిని అందుకోవడం కోసం శాంతాక్రజ్ నుండి బాంద్రాకు నడిచి పోతూ వుండేవాణ్ణి. నాకు రాబడి బాగానే ఉంది. దక్షిణ-ఆఫ్రికా క్లయింట్లు కూడా కొంచెం పని ఇస్తూ వున్నారు. అందువల్ల నా ఖర్చులకు సొమ్ము సరిపోతున్నది.

ఇంతవరకు నాకు హైకోర్టుతో పనిపడలేదు. కాని ఆ రోజుల్లో అక్కడ ‘సూట్‌’ (చర్య) జరుగుతూ వుండేది. దానికి వెళుతూ వుండేవాణ్ణి. అందులో పాల్గొందామంటే ధైర్యం చాలదు. అందు జమీయత్‌రామ్ నానా భాయిగారు ప్రధాన స్థానం ఆక్రమించుతూ వుండేవారని గుర్తు. క్రొత్త బారిస్టర్లందరివలె నేను కూడా హైకోర్టుకు కేసులు వినడానికి వెళుతూ వుండేవాణ్ణి. అచ్చట ఏదో ఒకటి వినడానికి బదులు సముద్రం మీద నుండి మెల్లమెల్లగా వచ్చే చల్లగాలికి కునికిపాట్లు పడి ఆనందం అనుభవిస్తూ వుండేవాణ్ణి. నా వలెనే కునికిపాట్లు పడే ఇతరుల్ని కూడా అక్కడ చూచి సిగ్గు పోగొట్టుకున్నాను. అక్కడ అలా నిద్రించడం కూడా ఒక ఫాషనేనని తలపోశాను. హైకోర్టులో గల గ్రంథాలయాన్ని ఉపయోగించడం ప్రారంభించాను. అక్కడ కొందరితో పరిచయం చేసుకోసాగాను. ఇక కొద్ది కాలంలోనే హైకోర్టులో పని ప్రారంభించగలనని భావించాను.

ఈ మధ్య వృత్తి నిర్వహణను గురించిన చింత కొంచెం కొంచెం తగ్గసాగింది. మరోవైపున గోఖ్లేగారి కండ్లు నా మీద వున్నాయి. వారానికి రెండు మూడు సార్లు నా ఛేంబరులోకి వచ్చి నా యోగక్షేమం తెలుసుకొని వెళ్ళసాగారు. అప్పుడప్పుడు తన మిత్రుల్ని కూడా తీసుకొని వస్తూ ఉండేవారు. పనిచేసే విధానం నాకు తెలుపుతూ ఉండేవారు.

అయితే నా భవిష్యద్విషయాన్ని గురించి ఒక్క సంగతి చెప్పడం మంచిదని భావిస్తున్నాను. నేను మొదట ఏమి చేయదలచుకొనేవాడినో ఈశ్వరుడు దాన్ని సాగనిచ్చేవాడు కాదు. తానొకటి తలిస్తే దైవమింకొకటి తలచినట్లు నా విషయంలో జరుగుతూ ఉంది. నేను స్థిరపడాలని నిశ్చయించుకున్నాను. కొంచెం స్వస్థుణ్ణి కూడా