పుట:సత్యశోధన.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి భాగం

1. జననం

గాంధీ కుటుంబం వారు మొదట పచారు దినుసులు అమ్ముకునేవారని ప్రతీతి. కాని మా తాతగారి పూర్వపు ముగ్గురు పురుషులు కాఠియావాడ్ కు చెందిన కొన్ని సంస్థానాల్లో మంత్రులుగా పని చేశారు. మాతాతగారి పేరు ఉత్తమచంద్ గాంధీ. ఆయనకు ఓతాగాంధీ అని మరో పేరు కూడా ఉండేది. ఆయన గట్టి నియమపాలకుడని ప్రతీతి. తత్ఫలితంగా కొన్ని రాజకీయ కుట్రలకు గురై పోరుబందరు దివాన్ గిరీ విడిచిపెట్టి జునాగఢ్ అను సంస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. అక్కడ ఆయన నవాబుకు ఎడమ చేత్తో సలాం చేశాడట. యీ అవిధేయతకు కారణం ఏమిటని ప్రశ్నించగా కుడిచేయి యిదివరకే పోరుబందరుకు అర్పితమై పోయిందని సమాధానం యిచ్చాడట.

భార్య చనిపోగా ఓతాగాంధీ రెండో పెండ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు నలుగురు కొడుకులు, రెండవ భార్యకు యిద్దరు కొడుకులు పుట్టారు. ఓతాగాంధీ కొడుకులంతా ఏక గర్భ సంజాతులు కారని బాల్యంలో నాకు తెలియదు. ఆ విషయం యితరుల వల్ల బాల్యంలో తెలుసుకున్నానని కూడా చెప్పలేను. ఆ ఆరుగురు అన్నదమ్ముల్లో అయిదవవాడు కరంచంద్ గాంధీ. ఆయనకు కబాగాంధీ అని మరో పేరు కూడా వున్నది. ఆరవవాడు తులసీదాసు గాంధీ. యీ అన్నదమ్ములిద్దరూ ఒకరి తరువాత ఒకరు పోరుబందరుకు దివానులుగా పనిచేశారు. కబాగాంధీ మా తండ్రి. పోరుబందరు ప్రధానామాత్య పదవిని త్యజించిన తరువాత ఆయన స్థానిక కోర్టులో సభ్యుడుగా పనిచేశారు. తరువాత రాజకోట దివానుగాను, ఆ తరువాత బికానేరుకు దివానుగాను పనిచేశారు. యావజ్జీవితం రాజకోట సంస్థానంలో పింఛను పుచ్చుకున్నారు.

కబాగాంధీకి నాలుగు పెళ్ళిళ్ళు జరిగాయి. మొదటి భార్యకు, రెండో భార్యకు యిద్దరు కూతుళ్ళు పుట్టారు. నాలుగో భార్య పుత్తలీబాయి. ఆమెకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు పుట్టారు. వారిలో నేను చివరివాణ్ణి. నా తండ్రి కులాభిమాని, సత్యప్రియుడు, శూరుడు, ఉదారుడు. కానీ కోపిష్టి. కొంచెం విషయలోలుడని చెప్పవచ్చు. ఎందుకంటే నలభై ఏళ్ళు గడిచాక నాలుగో పెళ్ళి చేసుకున్నారు కదా! ఆయన లంచగొండికాదనీ, ఇంటాబయటా కూడా పక్షపాతం లేకుండా వ్యవహరించే న్యాయశీలి అని ఖ్యాతి గడించారు. ఆయన సంస్థానాభిమానం సర్వవిదితం. ఆయన