పుట:సత్యశోధన.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

189

ఎప్పుడు ఏ విషయం యెడ పూర్ణ వైరాగ్యం కలుగుతుందో అప్పుడు శపధం పూనడం మంచిదని, అది దానంతటదే అనివార్యం అవుతుందని ఒక నిర్ణయానికి వచ్చాను.

8. బ్రహ్మచర్యం - 2

ఎంతో చర్చించి, ఎంతో ఆలోచించి 1909వ సంవత్సరంలో నేను బ్రహ్మచర్య వ్రతం చేపట్టాను. వ్రతం ప్రారంభించేవరకు నా భార్యకు యీ విషయం చెప్పలేదు. వ్రత సమయంలో చెప్పి ఆమె అనుమతి తీసుకున్నాను. ఇందుకు ఆమె అభ్యంతరం తెలుపలేదు.

ఈ వ్రతానికి పూనుకోవడం చాలా కష్టం అయింది. వికారాల్ని అణుచుకోవడం తేలిక విషయం కాదు కదా! భార్య విషయంలో వికారం కలుగకుండ వుండటం సామాన్య విషయమా? అయినా తక్షణ కర్తవ్యంగా భావించి నా లక్ష్యం శుద్ధమైనది గనుక పరమాత్ముడు కరుణించి నాకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించవలెనని ప్రార్ధించి యిందుకు పూనుకున్నాను. నేటికి 20 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు యీ వ్రతాన్ని గురించి యోచిస్తే నాకు ఆనందమేగాక ఆశ్చర్యం కూడా కలుగుతున్నది. నిగ్రహం అవసరమను భావం, తత్పరిపాలనమును గురించిన పట్టుదల 1901వ సంవత్సరంలో ప్రబలంగా వుండేది. ఇప్పుడు నాకు గల స్వాతంత్ర్యం, ఆనందం 1909వ సంవత్సరానికి పూర్వం వున్నట్లు గుర్తులేదు. ఆ సమయంలో నాకింకా వాంఛ తొలగలేదు. ఏ సమయంలోనైనా చ్యుతి కలుగవచ్చునని భయంగా వుండేది. ఇప్పుడు ఇట్టి స్థితిలేదు. వాంఛను అణుచుకోగలిగానను విశ్వాసం నాకు కలిగింది. బ్రహ్మచర్యం మహిమ రోజురోజుకు పెరిగిపోవడమేకాక, దాని అనుభవం నాకు కలుగసాగింది. ఫినిక్సు నందు బ్రహ్మచర్యవ్రతం ప్రారంభించాను. సైన్యాన్నుండి సెలవు పుచ్చుకొని ఫినిక్సు వెళ్లాను. అక్కడి నుండి వెంటనే జోహాన్సుబర్గు వెళ్లవలసి వచ్చింది. అక్కడే ఒక నెల లోపున సత్యాగ్రహ సమరానికి అంకురార్పణ జరిగింది. బ్రహ్మచర్య వ్రతమే నన్ను సత్యాగ్రహ సంగ్రామ ప్రారంభానికి పూనుకునేలా చేసిందని భావిస్తున్నాను. ముందు ఆలోచించుకొని నేను సత్యాగ్రహ సంగ్రామం ప్రారంభించలేదు, అనుకోకుండా అతి సహజంగా ప్రారంభమైంది. కాని దీనికి పూర్వం నేను చేసిన పనులు అనగా ఫినిక్సు వెళ్లడం, జోహాన్సుబర్గులో ఇంటి ఖర్చులు తగ్గించడం, బ్రహ్మచర్య వ్రతానికి పూనుకోవడం మొదలగునవి, సత్యాగ్రహ సంగ్రామం ప్రారంభించేందుకు దోహదం చేశాయని భావిస్తున్నాను.