పుట:సత్యశోధన.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

బ్రహ్మచర్యం - 1

వల్ల తాము పొందే సంతతి యొక్క శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక రక్షణకు పూనుకొనడం అవసరమను జ్ఞానం తల్లిదండ్రులు పొందుదురుగాక. ఆ విధంగా తన సంతతికి లాభం చేకూర్చెదరుగాక.

7. బ్రహ్మచర్యం - 1

ఇది నా బ్రహ్మచర్య వ్రతాన్ని గురించి వ్రాయతగిన సమయం. పెండ్లి రోజునే నా మనస్సునందు ఏకపత్నీవ్రతమను భావం నాటుకుంది. అది నా సత్యవ్రతంలో ఒక భాగం కూడా అయింది. గార్హ్యస్థ్య జీవితం గడుపుతున్నప్పటికీ బ్రహ్మచర్యం యొక్క ఆవశ్యకత దక్షిణ - ఆఫ్రికాలో నాకు బోధపడింది. ఏ సందర్భంలో ఏ పుస్తక ప్రభావం చేత యిట్టి ఆవశ్యకత బోధపడిందో నాకు గుర్తులేదు. రాయచంద్‌భాయి యిందుకు ప్రధాన కారణం అయివుండవచ్చని మాత్రం గుర్తు.

మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఒకటి యిప్పటికీ గుర్తు వున్నది. ఒకసారి నేను గ్లాడ్‌స్టన్ గారి యెడ వారి భార్యకు గల ప్రేమను గురించి ప్రస్తావించాను. హౌస్ ఆఫ్ కామన్సులో వున్నప్పుడు కూడా ఆమె తన భర్తకు తేనీరు కాచి ఇస్తూ వుండేదని ఎక్కడో చదివాను. నియమనిష్టలతో జీవితం గడిపే ఆ దంపతుల జీవితంలో ఇది గొప్ప విశేషం. ఈ విషయం ఆ కవికి చెప్పి దాంపత్య ప్రేమను స్తుతించాను. రాయచంద్ భాయి నా మాటలు విని “గ్లాడ్‌స్టన్ గారి భార్య గ్లాడ్‌స్టన్ గారికి పరిచర్య చేసిందనీ, అది గొప్ప విషయమనీ మీరు అంటున్నారు. సరే, ఆమె గ్లాడ్‌స్టన్‌గారి సోదరిగాని, పనిమనిషిగాని అని అనుకోండి. అట్టి ప్రేమతో తేనీరు కాచి ఇచ్చారనుకోండి. అట్టి స్థితిలో భార్య పరిచర్య గొప్పదా? సోదరి పరిచర్య గొప్పదా? పనిమనిషి పరిచర్య గొప్పదా? ఇట్టి సోదరి లేక పనిమనిషి యొక్క ఉదాహరణలు మనకు లేవా? ఈ ప్రేమ స్త్రీ జాతిలో గాక పురుష జాతిలో కనబడితే మీకు ఆనందాశ్చర్యాలు కలుగవా? ఈ విషయాన్ని గురించి కొంచెం ఆలోచించి చూడండి” అని అన్నాడు.

రాయచంద్ భాయి వివాహితుడే. ఆ సమయాన వారి మాటలు నాకు కఠోరంగా ఉన్నాయి. కాని వారి మాటలు సూదంటురాయిలా నన్ను ఆకర్షించాయి. భార్యకుగల స్వామిభక్తి యొక్క విలువకంటే పరిచారకుని స్వామిభక్తి యొక్క విలువ ఎక్కువ కాదా? భార్యాభర్తల మధ్య ప్రేమ వుండటంలో ఆశ్చర్యం ఏముంది? స్వామి సేవకుల మధ్య యిట్టి ప్రేమ అభిలషణీయం. రాయచంద్‌భాయి మాటల సారం యిదే కదా? వారి మాటలు నన్ను బాగా వశపరచుకున్నాయి.