పుట:సత్యశోధన.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

173

నాకు కనబడటం లేదు” అని జవాబిచ్చాను. అక్కడి వారంతా నవ్వారు. వారికి నా మాటలమీద విశ్వాసం కలగలేదన్నమాట.

ఈ విధంగా రోజులు కష్టంగా గడిచాయి. క్వారంటీను నుండి ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు. ఆఫీసరును అడిగితే “ఈ విషయం నా చేతులు దాటింది. ప్రభుత్వం ఆదేశించగానే మిమ్ము దింపివేస్తాం” అని సమాధానం యిచ్చాడు. ఇంతలో కడపటిసారిగా “మీరు ప్రాణాలు దక్కించుకోదలిస్తే మాకు లొంగిపోండి” అని తెల్లవారు హెచ్చరిక పంపారు. అందుకు సమాధానంగా “నేటాలు రేవులో దిగుటకు మాకు హక్కు వున్నది. ఎన్ని అపాయాలు వచ్చినా మా హక్కును కాపాడుకొంటాం” అని నేను, సహయాత్రికులం సమాధానం పంపించాం. ఇరవై మూడు రోజులు గడిచిపోయాయి. జనవరి 13 వతేదీనాడు ఓడలు రేవులోకి ప్రవేశించవచ్చని ఆదేశం యివ్వబడింది. యాత్రికులు రేవులో దిగవచ్చని కూడా ఆ ఆదేశంలో పేర్కొనబడింది.

3. ఒరిపిడి

ఓడలు రేవుకి చేరాయి. యాత్రికులంతా దిగిపోయారు. “తెల్లవాళ్ళు గాంధీమీద మండిపడుతున్నారు. వారి ప్రాణాలకు అపాయం కలుగవచ్చు. కనుక గాంధీని, వారి కుటుంబ సభ్యుల్ని రాత్రిపూట ఓడనుండి దింపండి. రేవు సూపరిండెంట్ టేటమ్ గారు రాత్రిపూట వాళ్ళను ఇంటికి భద్రంగా తీసుకు వెళతారు” అని ఎస్కాంబీగారు ఓడ కెప్టెనుకు కబురు పంపారు.

కెప్టెను నాకీ సందేశం అందజేశారు. నేను అందుకు అంగీకరించాను. ఈ సందేశం అంది అరగంట గడిచిందో లేదో టాటన్ గారు వచ్చి కెప్టెనుతో ఇలా అన్నాడు “గాంధీగారు నాతో రాదలచుకుంటే నా జవాబుదారీమీద వారిని తీసుకువెళతాను. గాంధీ గారిని గూర్చి ఎస్కాంబీగారు పంపిన సందేశాన్ని మీరు పాటించనవసరం లేదు. ఈ ఓడల యజమాని యొక్క వకీలు హోదాతో నేను చెబుతున్నాను” ఆ తరువాత ఆయన నా దగ్గరికి వచ్చి “మీకు ప్రాణాలంటే భయం లేకపోతే మీ భార్యాపిల్లల్ని బండిమీద రుస్తుంగారింటికి పంపించి, మనమిద్దరం కాలినడకన నడిచి వెళదాం. మీ మీద ఈగ కూడా వాలదని నా విశ్వాసం. ఇప్పుడు అంతటా శాంతి నెలకొని వుంది. తెల్లవారంతా వెళ్ళి పోయారు. మీరు దొంగవాడిలా చాటుగా వెళ్ళడం నాకిష్టంలేదు” అని అన్నాడు.