పుట:సత్యశోధన.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

147

ఆమె మనస్సు చివుక్కుమంది. నేను యిది గ్రహించాను. ప్రసంగం అంతటితో ఆపివేశాను. భోజనానికి లేచాము. ఆమె కుమారుడు ఐదేండ్లవాడు. నవ్వు ముఖం గలవాడు. అట్టి పిల్లవాడు దగ్గరవుంటే నాకు మరొకరితో మాట్లాడనవసరం ఉండదు. మేమిద్దరం చిరకాల మిత్రులం. పిల్లవాడి పళ్ళెంలో మాంసం ముక్క వుంది. దాన్ని చూచి నేను అతణ్ణి ఎగతాళి పట్టించాను. నా చేతిలో వున్న రేగుపండు అతనికి చూపించి “చూడు యిది దానికంటే ఎంత బాగుందో” అని అన్నాను. ఆ బాలుడు అమాయకుడు. అతడు నాతో కలిసిపోయాడు. నీ పండే బాగుంది అని అంటూ నాతో అనడం, యిద్దరం నవ్వుకోవడం ప్రారంభించాం.

ఇది చూచి ఆ పసివాడి తల్లి నొచ్చుకుంది. నాకు హెచ్చరిక లభించినట్లనిపించింది. వెంటనే ప్రసంగం మార్చివేశాను. మరుసటి ఆదివారం కూడా జంకుతూ జంకుతూనే వారింటికి వెళ్లాను. నేను అక్కడికి పోవడం మానుకోదలచలేదు. అది మంచిదని నేననుకోలేదు. కాని ఆమె నా పనిని తేలికచేసింది. ఆమె యిలా అన్నది “గాంధీ! నేనొక్క మాట చెబుతాను. వేరే విధంగా భావించవద్దు. నీ స్నేహం మా పిల్లవాడికి కూడదు. యిప్పుడు వీడు ప్రతిరోజూ మాంసం తిననని మారాం చేస్తున్నాడు. నీ వాదాన్ని ప్రతిసారి చెప్పి పండ్లు తెచ్చి పెట్టమని అంటున్నాడు. దీన్ని నేను సహించలేకపోతున్నాను. మాంసం తినకపోతే జబ్బు చేయదు కాని చిక్కి శల్యమైపోతాడు. నేను అట్టి స్థితిని భరించగలనా? నీవు యిట్టి చర్చలు పెద్దవాళ్లమైన మాతో చేయడం మంచిది కాని పిల్లవాడితో చేయవద్దు. దీనివల్ల పిల్లలు పాడైపోతారు”

ఆమె మాటలు వినేసరికి నాకు బాధ కలిగింది. యిలా అన్నాను - “అమ్మా! నాకు చాలా విచారంగా వుంది. నాకూ పిల్లలున్నారు. తల్లిదండ్రుల భావాలు నాకు తెలియవా? యిక మీకు యిట్టి కష్టం కలుగనీయను. ఇది చాలా సులభం కూడా. నేను చెప్పిన మాటల కంటే నేను తినే వస్తువులు తినకుండా వదిలివేసే పదార్ధాలు చూచినప్పుడు పిల్లవాని మనస్సుకు అవి హత్తుకుంటాయి. అందువల్ల యీనాటి నుండి నేను మీ యింటికి రావడం మానుకుంటాను. అదే యిందుకు తగిన చికిత్స అని అనిపిస్తూ వుంది. అయితే దీనివల్ల మన స్నేహానికి భంగం రాదు, రాకూడదు”

“మీ మాటలు చాలా బాగున్నాయి” అలాగే చేయండి అని ఆ గృహిణి అమిత సంతోషంతో అన్నది.