పుట:సత్యశోధన.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

143

భావించి బలవంతంగా పంపివేయడానికి పూనుకున్నారు. కాని అందుకు ఇండియా ప్రభుత్వంవారు అంగీకరించలేదు. తరువాత కొన్ని షరతులు ప్రవేశ పెట్టబడ్డాయి.

(1) గిరిమిటియాలు తమ నియమిత కాలం పూర్తికాగానే ఇండియాకు వెళ్లిపోవాలి. అలా వెళ్లని యెడల

(2) రెండేండ్లకు ఒక్కసారి క్రొత్త ఒడంబడిక వ్రాస్తూ వుండాలి. ఒడంబడిక వ్రాయబడినపుడు జీతం కొంచెం కొంచెం పెంచబడుతూ వుంటుంది.

(3) క్రొత్త ఒడంబడిక వ్రాయక, ఇండియాకు తిరిగిపోకుండా నేటాలులోనేవుంటే సాలుకు 25 పౌండ్లు అనగా 375 రూపాయలు పన్ను రూపంలోచెల్లిస్తూ వుండాలి.

ఈ షరతుల్ని ఇండియా ప్రభుత్వం వారిచే అంగీకరింపచేయుటకు సర్ హెన్రీ బిన్, మిస్టర్ మేసను అనువారు ఇండియాకు వచ్చారు. అప్పుడు లార్డ్ ఎల్గిన్ ఇండియా వైస్రాయిగా వున్నారు. అతడు 25 పౌండ్ల పన్ను అంగీకరించాడు. ఇది వైస్రాయి చేసిన పెద్ద తప్పిదం. అప్పుడూ యిప్పుడూ కూడా నా అభిప్రాయం ఇదే. ఈ విధంగా నిర్ణయించి అతడు ఇండియాకు ఈషణ్మాత్రమైనా మేలు చేయలేదు. నేటాలు తెల్లవాళ్లకు ఆ విధంగా లాభం చేకూర్చడం వైస్రాయికి పాడిగాదు. మూడు నాలుగేండ్లలో ప్రతి గిరిమిటియా తనకు, తన భార్యకు, పదహారేండ్ల కొడుక్కు, పదమూడేండ్ల కుమార్తెకు మూడు మూడు పౌండ్ల చొప్పున పన్ను చెల్లించాలి. నెలకు వారి ఆదాయం 14 షిల్లింగులు మాత్రమే. అంతకంటే మించి సంపాదించని భార్యాభర్తలకు, వారిద్దరి పిల్లలకు కలపి కుటుంబానికి సాలుకు 12 పౌండ్లు అంటే 180 రూపాయల పన్ను వేయడం ఏ దేశంలోను కనీవినీ ఎరుగని అత్యాచారమే.

ఈ పన్నును ప్రతిఘటిస్తూ మేము ఉద్యమం ప్రారంభించాము. ఈ విషయంలో నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ మౌనం వహించియుంటే ఇండియా వైస్రాయి 25 పౌండ్లు మంజూరు చేసియుండేవాడే. 25 పౌండ్లు 2 పౌండ్లకు తగ్గడం కూడా నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ వారు జరిపిన ఉద్యమ ప్రభావమే కావచ్చు లేక నా భావం పొరపాటే కావచ్చు. కాంగ్రెసువారు ఉద్యమం నడిపినా నడపకపోయినా ఇండియా ప్రభుత్వం వారు 3 పౌండ్ల పన్ను మంజూరు చేసియుందురని అనవచ్చు. ఏది ఏమైనా ఇది భారతీయుల యెడ అనుచిత చర్యయే. భారతదేశ యోగక్షేమాలను పరిరక్షించవలసిన వైస్రాయి అమానుషమైన యిట్టి పన్నును మంజూరు చేసి యుండకూడదు.