పుట:సత్యశోధన.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

141

ఈ కేసు గొప్పదేమీకాదు. కాని నేటాలులో తమకు న్యాయం సాధించగల వాడొకడు బయల్దేరాడను వార్త గిరిమిటియాలకు ఉత్సాహం కలిగించింది.

బాలసుందరం నా దగ్గరకు వచ్చినప్పుడు తలపాగా తీసి చేత పట్టుకొని వున్నాడని నేను ముందే తెలియజేశాను. అసలు ఈ దృశ్యంలో ఒక విచిత్రమైన కరుణరసం మరియు నైచ్యం నిండి వున్నాయి. జడ్జి నా తలపాగాను తీసివేయమన్నప్పటి ఘట్టాన్ని గురించి మొదట వ్రాశాను. తెల్లవాణ్ణి చూడటానికి వెళ్లినప్పుడు గిరిమిటియా గాని, క్రొత్త భారతీయుడు గాని తన తలపాగా తీసి చేతులతో పట్టుకోవాలి. రెండు చేతులు జోడించి నమస్కరించినా అది తక్కువే. బాలసుందరం నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అలాగే చేయాలని అనుకున్నాడు. ఈ రకమైన చర్యను చూడటం నాకు యిదే ప్రథమం. ఈ చర్య నాకు చిన్నతనం అనిపించింది. నేను బాలసుందరాన్ని తలపాగా చుట్టుకోమని చెప్పాను. అతడు ఎంతో సంకోచిస్తూ పాగాను తలకు చుట్టుకున్నాడు. అయితే అప్పుడు అతడి ముఖంమీద సంతోషం తొంగిచూచింది.

తను తోటి మానవులను నీచపరచడం వల్ల తమకేదో గౌరవం చేకూరుతుందని భావించేవారి ఉద్దేశం ఏమిటో నాకు బోధపడదు. అట్టి తత్వం సరికాదని నా నిశ్చితాభిప్రాయం.

21. మూడు పౌండ్ల పన్ను

బాలసుందరం కేసుతో గిరిమిటియాలతో నాకు సంబంధం పెరిగింది. అటు ప్రభుత్వం కూడా ఎక్కువ పన్నులు వసూలు చేసి వారిని బాధించడం ప్రారంభించింది. అందువల్ల వారిని గురించి చదువవలసి వచ్చింది.

1894వ సంవత్సరంలో నేటాలు ప్రభుత్వం వారు గిరిమిటియాలు సాలీనా తలకు 25 పౌండ్ల చొప్పున అంటే 375 రూపాయలు పన్ను కట్టాలని బిల్లు తయారుచేశారు. దీన్ని చూచి నిర్విణ్ణుడనయ్యాను. ఈ విషయం కాంగ్రెస్ సమావేశంలో చర్చకు ప్రవేశ పెట్టాను. అందు యీ బిల్లును వ్యతిరేకంగా గట్టి ప్రయత్నం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించబడింది.

ఈ పన్నుకు అసలు కారణం ఏమిటో యిక్కడ కొద్దిగా వివరిస్తాను. 1860లో నేటాలు నందలి తెల్లవారు అక్కడి భూములు కొన్నారు. అక్కడి భూములు చక్కెర తోటల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయని తెలుసుకున్నారు. అయితే కూలీలు