పుట:సత్యశోధన.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

137

ప్రొద్దుపోయింది. మాకందరికీ బాగా ఆకలివేస్తూ వున్నది. అనుకున్న మొత్తం రానిదే భోజనం ఎలా చేయడం? ఎంత బ్రతిమిలాడినా ప్రయోజనం కలగలేదు. దాత పట్టిన పట్టు విడవలేదు. పట్టణంలో వుండే వర్తకులంతా చెప్పి చూచారు. మేమంతా రాత్రంతా ఆయనతో గడిపాము. అయినా ఆయన లొంగలేదు. మేము కూడా మెత్తబడలేదు. నా సహచరులలో చాలామందికి కోపం వచ్చింది. అయినా సౌజన్యాన్ని వదలలేదు. తూర్పున ఉషోదయ కిరణాలు తొంగి చూడసాగాయి. అప్పుడు ఆయన ఆరు పౌండ్లు యిచ్చాడు. మాకందరికీ విందు కూడా చేశాడు. ఇది టోంగాటా పట్టణంలో జరిగిన ఘట్టం. అయితే ఈ వార్త ఉత్తర దిక్కున గల స్టేంగల్ పట్టణం మొదలుకొని దేశం మధ్యన చార్లెస్ టౌను వరకు ప్రతిధ్వనించింది. దీని వల్ల చందా వసూళ్ల పని మాకు తేలిక అయింది.

కాని మా పని ధనం వసూలు చేయడమేకాదు. అవసరాన్ని మించి ధనం మన దగ్గర వుంచవద్దని నేను నా సహచరులందరికీ ముందే చెప్పి వుంచాను. అవసరాన్ని బట్టి వారానికి ఒకసారి, నెలకొకసారి సభలు జరుపుతూ వచ్చాం. ప్రతి సభలోను వెనుక జరిగిన కార్యక్రమ వివరమంతా చెప్పడం జరుగుతూ వుండేది. ఇట్టి చర్చల్లో డొంక తిరుగుడు లేకుండా మాట్లాడటం అక్కడి వారికి తెలియదు. సభల్లో ప్రసంగించడానికి అంతా సంకోచించసాగారు. అయితే మాట్లాడవలసిన తీరు, చర్చల సరళి గురించి వారికి వివరిస్తూ వుండేవాణ్ణి. వారు ఆ ప్రకారం ప్రసంగించడం ప్రారంభించారు. వారు ఉపన్యసించడం ఒక విద్య అని తెలుసుకున్నారు. ఉపన్యాసం అంటే ఏమిటో తెలియని వారు కూడా ఆలోచించి ఉపన్యసించసాగారు.

ప్రజల కార్యక్రమాల్లో చిల్లర ఖర్చులు మితిమీరి పోవడం నేనెరుగుదును. మొదట రసీదు పుస్తకాలు అచ్చు వేయవద్దనుకున్నాను. నా దగ్గర సైక్లోస్టయిలు మిషసు వుంది. దానిమీద రశీదుల, రిపోర్టుల ప్రతులు తీయించసాగాను. కాంగ్రెస్‌లో డబ్బు ఎక్కువగా వుండి, సభ్యుల సంఖ్య అధికమైనప్పుడు మాత్రమే యిట్టి వాటిని అచ్చు వేయించేవాణ్ణి. పొదుపు చేయాలను తలంపే అందుకు కారణం. అయినా చాలా చోట్ల యిలా జరగలేదు. సంస్థ చిన్నదైనా పెద్దదైనా అందరికీ యీ విషయాలు తెలియాలనే తలంపుతో వివరంగా యిక్కడ వ్రాశాను.

జనం డబ్బు యిచ్చి రసీదులడిగే వారు కారు. కాని మేము మాత్రం రసీదులివ్వడం అవసరమని భావించాం. ఆవిధంగా ప్రతి దమ్మిడీకి రసీదులు యిచ్చాం. పైసపైసకు