పుట:సత్యశోధన.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

125

వ్రాసిన “ది పరఫెక్ట్ వే” అను గ్రంధం ఆయన నాకు పంపించారు. ఇప్పుడు ప్రచారంలో వున్న క్రైస్తవ మత ఖండన ఆ గ్రంధంలో వుంది. మెయిట్లండు గారు ‘ది న్యూ ఇంటర్ ప్రెటేషన్ ఆఫ్ బైబిల్’ అను గ్రంధం హిందూమత విధానంలో వుంది. టాల్‌స్టాయి గారి “ది కింగ్‌డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు” అను గ్రంథం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఆ గ్రంథం నా మనస్సులో అంకితమై పోయింది. అందలి స్వతంత్ర్య యోచనా విధానం, ప్రౌఢ విధానం, శుద్ధ సత్యం వీటిని బట్టి పరిశీలించి చూస్తే యీ గ్రంధం ఎదుట కోట్సుగారిచ్చిన గ్రంధాలన్నీ దండుగేనని అనిపించింది.

ఆ గ్రంధ పఠనం వల్ల నేను క్రైస్తవ మిత్రులెన్నడును ఊహించని దారిలో పడ్డాను. మెయిట్లండుగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు చాలాకాలం నడిచాయి. శాశ్వతంగా కన్ను మూయనంతవరకు రాయచంద్‌భాయి గారికి నాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి. వారు పంపిన గ్రంధాలు చదివాను. వాటిలో పంచీకరణం, మణిరత్నమాల, యోగవాసిష్ఠమునందలి “ముముక్షు ప్రకరణం” హరిభద్రసూరి విరచిత “షడ్దర్శన సముచ్ఛయం” మొదలగు గ్రంధాలు పేర్కొనదగినవి.

నేను నా క్రైస్తవ మిత్రులు ఉహించని దారిని పడినప్పటికీ వారి సాంగత్యం వల్ల నాకు కలిగిన ధర్మ జిజ్ఞాస అధికం. అందుకు నేను వారికి రుణపడ్డానని చెప్పగలను. వారి పరిచయం నాకు సదా గుర్తుంటుంది. మధురం, పవిత్రం అయిన యిట్టి స్నేహ బంధాలు క్రమంగా పెరుగుతూ వున్నాయే కాని తరగలేదు.

16. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు ?

అబ్దుల్లా సేఠ్‌గారి కేసు పరిష్కారం అయింది. ఇక నాకు ప్రిటోరియాతో ఏం పని? దర్బనుకు వెళ్లి ఇంటికి ప్రయాణం అవుదామనే ప్రయత్నం ప్రారంభించాను. కాని అబ్దుల్లా సేఠ్ వీడ్కోలు విందు చేయకుండా నన్ను విడిచి పెడతాడా? నన్ను గౌరవించేందుకూ ఆయన సిడెన్ హోములో ఒక విందు ఏర్పాడు చేశాడు.

ఆ రోజంతా విందుతో కాలక్షేపం చేయాలని నిర్ణయం. నా దగ్గర కొన్ని వార్తా పత్రికలు వున్నాయి. వాటిని తిరగవేస్తూ కూర్చున్నాను. ఒక పత్రికలో ఒక మూల “ఇండియన్ ఫ్రాంచైజ్” అను శీర్షికతో కొన్ని వాక్యాలు నా కంటబడ్డాయి. నేటాల్ శాసన సభలో సభ్యుల్ని ఎన్నుకొనుటకు భారతీయులకు హక్కు లేకుండా చేసేందుకు ఒక