పుట:సత్యశోధన.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

దావా వేయుటకు ఏర్పాట్లు

పోలీసు డచ్చివాడు. వారిద్దరు డచ్చి భాషలో మాట్లాడుతున్నారు. నాకు వారి మాటలు అర్థంకాలేదు. చిట్ట చివరికి ఆ పోలీసు నన్ను క్షమాపణ కోరాడు. కాని అతడు క్షమాపణ కోరనవసరమే లేదు. నేను అతణ్ణి మొదటనే క్షమించి వేశాను.

అటు తరువాత నేనా వీధికి పోలేదు. అయినా మిగతా పోలీసులకు యీ విషయం తెలియదు కదా! వాళ్ల చేతుల్లో నేను దెబ్బలు తినడం ఎందుకు అని భావించి యితర వీధులగుండా షికారుకు పోవడం ప్రారంభించాను.

ఈ విషయమై భారతీయులను గురించి లోతుగా ఆలోచించడం ప్రారంభించాను. ఈ శాసనాన్ని గురించి బ్రిటిష్ ఏజంటుతో మాట్లాడదామనీ, అవకాశం చిక్కితే ఒక దావా వేసి చూద్దామనీ భారతీయులతో చర్చించాను. యీ విధంగా భారతీయుల బాధల్ని గురించి వినడం చదవడమే గాక స్వయంగా కూడా నేను వాటిని అనుభవించాను. ఆత్మగౌరవం నిలుపుకోవాలని భావించే భారతీయులకు దక్షిణ ఆఫ్రికా అనువైన చోటు కాదనే నిర్ణయానికి వచ్చాను. ఈ పరిస్థితిని ఎలా మార్చడం?

అయితే ప్రస్తుతం నా కర్తవ్యం ఏమిటి? దాదా అబ్దుల్లాగారి దావా వ్యవహారం చూడటమేకదా! కనుక అందుకు పూనుకున్నాను.

14. దావా వేయుటకు ఏర్పాట్లు

ప్రిటోరియాలో నేను ఒక సంవత్సరం వున్నాను. నా జీవితంలో ఆ సమయం అమూల్యమైనది. ప్రజాసేవ చేయాలనే తలంపు నాకు కలిగింది. అందుకు అక్కడే శక్తి చేకూరింది. నాకు మతం విషయమై ఆసక్తి అక్కడే కలిగింది. ప్లీడరు పనిని గురించి సరియైన జ్ఞానం అక్కడే కలిగింది. క్రొత్త బారిస్టర్లు పాత బారిస్టర్ల దగ్గర నేర్చుకోగలిగినది నేను అక్కడే నేర్చుకున్నాను. ప్లీడరు పనికి కొంచెం పనికి వస్తానని నేను అక్కడే తెలుసుకున్నాను. ప్లీడరు పనికి తాళంచెవి అక్కడే నాకు దొరికింది.

దాదా అబ్దుల్లా గారి దావా చిన్నదికారు. నలభై వేల పౌండ్లకు, అంటే ఆరు లక్షల రూపాయలకు సంబంధించిన దావా అది. యిది వ్యాపారానికి సంబంధించిన దావా. అందువల్ల లెక్కల చిక్కులు అపరిమితంగా వున్నాయి. ప్రాంశరీ నోట్లకు, నోటు వ్రాసి యిస్తామన్న నోటి నూటలకు కూడా యీ దావాతో సంబంధం వుంది. యీ దావాకు యిదే ఆధారం. ప్రాంశరీ నోట్లు మోసం చేసి వ్రాయించుకోబడ్డాయనీ, వాటికి తగిన ఆధారాలు లేవని ప్రతివాదుల వాదన. మొత్తం మీద దావా పూర్తిగా చిక్కుల మయం.