పుట:సత్యశోధన.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

కొన్ని అనుభవాలు

నాకోసం తాను ఎప్పుడూ ప్రిటోరియాలో వుండవలసి వస్తుంది. అది ఆయనకు వీలుపడని పని. ప్రతివాదులు ప్రిటోరియాలోనే వున్నారు. వాళ్లు నన్ను తమవైపుకు త్రిప్పుకుంటారేమోనని ఆయనకు భయం. అయితే ఆ దావా కాకపోతే నాకు అప్పగించే పని యింకేముంది.

మిగతా పనులన్ని నాకంటే ఆయన గుమాస్తాలే బాగా చేయగలరు. ఆ గుమాస్తాలు తప్పు చేస్తే వాళ్లను దండించవచ్చు. కాని నేను తప్పు చేస్తే దడించేదెలా? ఆ దావాలో ఏదో పని అప్పగించకపోతే ఊరికే కూర్చోబెట్టి మేపవలసి వస్తుంది.

అబ్దుల్లా గారికి అక్షర జ్ఞానం తక్కువే కాని జ్ఞానం ఎక్కువ. ఆయన బుద్ధి చాలా చురుకైనది. బ్యాంకు మేనేజర్లతో వ్యవహారం నడుపుకొనుటకు తెల్ల వర్తకులతో వ్యవహారం గడుపుకొనుటకు, వకీళ్లకు తన వ్యవహారాలు చెప్పుటకు తగినంత ఇంగ్లీషు ఆయనకు నచ్చు. భారతీయులకు ఆయనంటే గౌరవం. వారి వ్యాపార సంస్థ అక్కడి వ్యాపార సంఘాలన్నింటిలోకి పెద్దది. హిందూ దేశస్థుల వ్యాపార సంఘాలన్నింటిలోకి పెద్దది. అన్నీ వున్నాయిగాని ఒక లోటు మాత్రం ఆయనలో వుంది. ఆయనది అనుమాన స్వభావం.

ఆయనకు ఇస్లాం మతమంటే అమిత అభిమానం. తత్వ జ్ఞానాన్ని గురించి మాట్లాడాలనే తపన ఆయనకు వుంది. ఖురాన్ షరీఫు మరియు తదితర ఇస్లాం మత గ్రంధాలలో ఆయనకు కొద్దిగా ప్రవేశం వుంది. మాట్లాడేప్పుడు అనేక ప్రమాణ వాక్యాలు అమితంగా ఉపయోగిస్తూ వుంటాడు. ఆయనను కలియడం వల్ల ఇస్లాం మతం విషయమై నాకు కొంత పరిజ్ఞానం కలిగింది. మా మనస్సులు కలిసిన కొద్దీ ఇస్లాం తత్వ విషయాలను గురించి చర్చించడం ప్రారంభించాడు.

నేనచ్చటికి వెళ్లిన రెండవరోజునో, మూడవరోజునో అబ్దుల్లా సేఠ్ నన్ను దర్బను కోర్టుకు తీసుకువెళ్లాడు. తమ మిత్రులను నాకు పరిచయం చేశాడు. కోర్టులో తన వకీలు ప్రక్కనే నన్ను కూర్చోబెట్టాడు. మొదటినుండి మేజిస్ట్రేటు నావంక మిర్రి మిర్రిగా చూడటం ప్రారంభించాడు. చివరకు తలపాగాను తీసి వేయమని ఆదేశించాడు. తలపాగా తీయను అని చెప్పి కోర్టునుంచి బయటకు వచ్చివేశాను.

ఇక్కడ కూడా తగవు మొదలైందని భావించాను. భారతీయులచే తలపాగాలు తీసివేయించుటకు గల కారణాలు అబ్దుల్లా వివరించి చెప్పారు. మహమ్మదీయ ఆచారాలు కలవారు తలపాగాలు పెట్టుకోవచ్చు. కాని కోర్టుకు వచ్చే మిగతా హిందూ దేశం వారు మాత్రం తలపాగా ధరించరాదని శాసనం, యీ సూక్ష్మ భేదం