పుట:సత్యశోధన.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

89

వున్నాను. నౌకరు నా రెండు భుజాలు పట్టుకొని బైటకి పంపివేశాడు. రొప్పుతూ రొప్పుతూ లోనికి వెళ్లి ఒక జాబు వ్రాశాను. “మీరు నన్ను అవమానించారు. నౌకరు ద్వారా నన్ను బయటకి నెట్టించారు. యిందుకు సముజాయిషీ చెప్పుకోకపోతే మీమీద కోర్టులో మాననష్టం దావా వేస్తాను” అని ఆ జాబులో వ్రాశాను. ఆ దొర వెంటనే ఒక గుర్రపు రౌతు ద్వారా పత్రం పంపించాడు. “మీరు నా దగ్గర అసభ్యంగా వ్యవహరించారు. నేను వెళ్లమని చెప్పినా మీరు వెళ్లలేదు. గత్యంతరం లేక మిమ్మల్ని నౌకరు ద్వారా బయటికి పంపక తప్పలేదు. నౌకరు పొమ్మన్నా మీరు పోలేదు. అందువల్ల మిమ్ము బైటకి పంపించుటకు బలం ఉపయోగించక తప్పలేదు. మీరేం చేసుకున్నా సరే” అని ఆ పత్రంలో వ్రాశాడు.

ఆ పత్రం జేబులో పెట్టుకొని తలవంచుకొని యింటికి చేరాను. జరిగిందంతా మా అన్నగారికి తెలియజేశాను. ఆయన చాలా బాధపడ్డాడు. నన్ను ఎలా శాంతపరచాలో ఆయనకు బోధపడలేదు. ఆ దొర మీద కేసు పెట్టాలని నా భావం. ఆ విషయమై మా అన్న కొందరు వకీళ్ల సలహా తీసుకున్నారు. సరీగా ఆ సమయానికి సర్ ఫిరోజ్ వచ్చారు. వారిని క్రొత్త బారిష్టరు కలవడం సాధ్యం కాదు గదా! అందువల్ల వారిని తీసుకొని వచ్చిన వకీలుకు యీ వివరమంతా వ్రాసిన పత్రం యిచ్చి మెహతా గారి సలహా అర్థించాను. వకీలు నా పత్రం మెహతా గారికి అందజేశారు.

“ఇప్పుడు చాలామంది బారిష్టర్లకు, వకీళ్లకు యిట్టి అనుభవాలే కలుగుతున్నాయి. అతడు ఆంగ్ల దేశం నుండి యిప్పుడే వచ్చాడు కదా! అందువల్ల ఉడుకుపాలు ఎక్కువగా వుంది. ఆంగ్ల దొరల స్వభావం యింకా అతనికి తెలియదు. ధనం బాగా సంపాదించ కోరితే, జీవితం సుఖంగా గడపాలని భావిస్తే యిటువంటి అవమానాల్ని దిగమ్రింగవలసిందే. యీ తెల్లదొరతో కలహం పెట్టుకుంటే నష్టమేగాని లాభం కలుగదు. గాంధీజీకి యింకా లోకజ్ఞానం అవసరం.” అని ఫిరోజ్‌గారు ఆ వకీలు ద్వారా నాకు సలహా పంపారు.

వారి సలహా నాకు విషప్రాయంగా తోచింది. కాని మ్రింగక తప్పలేదు. అందువల్ల కొంత ప్రయోజనం కూడా కలిగింది. ఇక భవిష్యత్తులో యిలాంటి పనులు చేయకూడదని, స్నేహాన్ని యీ విధంగా వినియోగించుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చాను. అప్పటి నుండి ఆ నిర్ణయాన్ని అతిక్రమించలేదు. తత్ఫలితంగా నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది.