పుట:సత్యశోధన.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

మొదటి కేసు

దానికి అయ్యే ఖర్చు అతడే భరించాడు. చిత్తు వ్రాసి మిత్రులకు వినిపించాను. బాగున్నదని వారంతా అన్నారు. దానితో యిట్టి అర్జీలనైనా వ్రాయగలననే ధైర్యం కలిగింది. అది నిజం కూడా.

డబ్చు పుచ్చుకోకుండా యీ విధంగా అర్జీలు వ్రాసి పెట్టడానికి సమయం బాగా పట్టేది. కాని బండి సాగాలికదా! అందువల్ల ఉపాధ్యాయ వృత్తి ఏదైనా దొరుకుతుందేమోనని చూచాను. నాకు ఇంగ్లీషు భాష వచ్చు. అందువల్ల మెట్రిక్యులేషన్ పిల్లలకు ఇంగ్లీషు నేర్పే ఉపాధ్యాయ పదవి లభిస్తే మంచిదని యింటి ఖర్చులకు కొంత సరిపోతుందని భావించాను. పత్రికలలో ఒక విజ్ఞాపన “ఒక ఆంగ్ల ఉపాధ్యాయుడు కావాలి. ఒక గంట ఇంగ్లీషు బోధించాలి. జీతం నెలకు 75 రూపాయలు” అని వెలువడింది. అది అక్కడి ఒక ప్రసిద్ధ హైస్కూలు వారి విజ్ఞాపన. వారికి అప్లికేషన్ పంపాను. వారు వచ్చి కలవమని జాబు వ్రాశారు. నేను సంతోషంతో వెళ్లాను. బి ఏ ప్యాసు కాలేదు. గనుక నీవు మాకు పనికిరావని ఆ స్కూలు హెడ్‌మాస్టరు చెప్పివేశాడు.

‘నేను లాటిన్ ద్వితీయ భాషగా ఇంగ్లాండులో మెట్రిక్యులేషన్ పరీక్ష పాసైనాను.‘ “నిజమే కాని మాకు కావలసింది బి.ఏ." ఆ ఉద్యోగం దొరకలేదు. బాధపడ్డాను. మా అన్నగారుకూడా చాలా బాధపడ్డారు. యిక బొంబాయిలో వుండటం అనవసరమని నిర్ణయానికి వచ్చాను. నేను రాజకోటలో వుండటం మంచిది. అక్కడ మా అన్నగారు చిన్న వకీలు. ఆయన అర్జీలు వ్రాసేపని నాకు అప్పగించగలడు. రాజకోటలో సంసారం వున్నది. బొంబాయిలో సంసారం ఎత్తివేస్తే ఖర్చులు తగ్గిపోతాయి కనుక బొంబాయిలో ఆరు నెలల నివాసానికి స్వస్తి చెప్పాను.

బొంబాయిలో నేను ప్రతిరోజు హైకోర్టుకు వెళుతూ వుండేవాణ్ణి. కాని అక్కడ నాకేమీ ప్రయోజనం కలుగలేదు. ఎక్కువ నేర్చుకుందామనే ఆసక్తి కూడా కలుగలేదు. అక్కడ నడిచే కేసులు అర్థం కాక చాలాసార్లు నిద్ర వచ్చేది. నాతోబాటు యింకా కొంతమంది నిద్రబోయే వకీళ్ళు కూడా వున్నందున నేను సిగ్గుపడలేదు. తరువాత హైకోర్టులో కూర్చొని నిద్రపోవడం కూడా దర్జాయే అని భావించి సిగ్గుపడటం పూర్తిగా మానివేశాను.

నడిచి వెళ్లడం, యింటికి రావడం అలవాటు చేసుకున్నాను. నడిచి వెళ్లడానికి నలభై అయిదు నిమిషాలు పట్టేది. వచ్చేటప్పుడూ అంతే. ఎండకు తట్టుకునేవాణ్ణి. అందువల్ల ఖర్చు బాగా తగ్గింది. నా మిత్రులు చాలామంది జబ్బుపడుతూ వుండేవారు.