పుట:సత్యశోధన.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

77

నేను చదివిన కొద్ది గ్రంథాల పేర్లు చెప్పాను. ఆయన కొంచెం నిరాశపడ్డారు. ఒక్క క్షణం సేపు అలా ఉండి చిరునవ్వు నవ్వుతూ “నీ క్షోభ నాకు అర్థం అయింది. నీకు ఇతర గ్రంథాల వల్ల కలిగిన జ్ఞానం కొద్దే. నీకు గల ప్రపంచజ్ఞానం కొద్దే. నీవు కనీసం హిందూ దేశచరిత్ర అయినా చదవాలి. మనిషి స్వభావం తెలుసుకోవాలి. మనిషి మొహం చూచి అతడెట్టివాడో తెలుసుకొనగలిగివుండాలి. ప్రతి హిందువు హిందూ దేశ చరిత్ర చదివి తీరాలి. లాయరుకు దానితో సంబంధం లేకపోయినా దాన్ని చదవాలి. విషయం తెలుసుకోవాలి. కే మరియు మాలెసన్‌గారు కలిసి వ్రాసిన 1857 సంవత్సరపు విప్లవ చరిత్ర కూడా నీవు చదవలేదు. వెంటనే ఆ పుస్తకం చదువు. మానవ స్వభావాన్ని గురించి తెలియజెప్పే ముఖ సాముద్రికాన్ని గురించి లావేటరు గారు, షెమ్మెల్ పెన్నిక్ గారు వ్రాసిన గ్రంథాలు సంపాదించు” అని చెప్పి ఆ గ్రంథాల పేర్లు కాగితం మీద వ్రాసి నాకు ఇచ్చారు.

వారికి నేనెంతో కృతజ్ఞుణ్ణి. ఆయన ఎదుట నా భయం ఎగిరిపోయింది. కాని కాలు బయట పెట్టగానే మళ్ళీ బెంగ మొదలైంది. ముఖం చూచి మనిషి స్వభావం తెలుసుకోవడం ఎట్లా అని దారి పొడుగునా అనుకుంటూ ఆ రెండు పుస్తకాలను గురించి యోచిస్తూ ఇంటికి చేరాను. దుకాణంలో షెమ్మిల్ పెన్నిక్ గారి పుస్తకం దొరకలేదు. మర్నాడు లావేటరు గారి పుస్తకం చదివాను. అదీ స్నెల్‌గారి “ఈక్విటీ” కంటే కష్టంగా ఉంది. షేక్స్పియర్‌గారి ముఖసాముద్రికం చదివాను. కాని లండను వీధుల్లో క్రింది నుండి పైకి, పైనుండి క్రిందికి ఎంత తిరిగినా షేక్స్పియర్‌గారు చెప్పినట్లు ముఖసాముద్రికాన్ని గురించి తెలుసుకునే ప్రావీణ్యం నాకు కలుగలేదు.

లావేటరు గారి పుస్తకం నాకు ఉపయోగపడలేదు. కాని వారి స్నేహం నాకు ఎంతో ఉపయోగపడింది. వారి నవ్వుముఖం, ఉదారాకృతి నా హృదయానికి హత్తుకున్నాయి. మంచి లాయరు అయ్యేందుకు ఫిరోజ్‌షా మెహతా గారి నైపుణ్యం, ధారణాశక్తి అవసరంలేదు. కాని ప్రామాణికత, శ్రద్ధ, కష్టపడి పనిచేసే మనస్తత్వం అవసరమని వారిచ్చిన సలహా మీద నాకు విశ్వాసం ఏర్పడింది. ఆ ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించుకున్నాను. దానితో కొంచెం ఆశ చిగురించింది.

కే మరియు మాలెసన్ గారు కలిసి వ్రాసిన గ్రంధాల్ని చదవలేకపోయాను. సమయం దొరికితే ముందు ముందు వారి గ్రంథాల్ని చదవాలని నిర్ణయించుకున్నాను. ఆ నా కోరిక దక్షిణాఫ్రికాలో తీరింది. నన్ను పట్టుకున్న బెంగలో కొంత ఆశారేఖ గోచరించింది. దానితో అస్సాము అను స్టీమరు ఎక్కి బొంబాయి చేరాను. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. లాంచీలో ఒడ్డుకు చేరాను.

* * *