పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ॥ పుంజీభవించి యుప్పొంగి శైలములు శృం
             గములెత్తి దివిని బ్రాకంగఁజనిన,
    రంగదుత్తుంగ తరంగ సంఘములతో
             నీరధి కలఁగి ఘోర్ణిల్లుచున్న ,
    హోమకుండముల సహోరాత్రముల నూర్ధ్వ
             శిఖల నగ్ని తపంబు సేయుచున్నఁ
     గులశైలములు పెల్లగిలఁ బ్రభంజనుఁడు జృం
             భించి భీకరధాటి వీచుచున్న
             
గీ॥ శబ్దగుణరూఢి నవ్యయ సరణి నభము
    విష్ణుపదమై తనర్చిన, వీసమైన
    నేజనని శక్తిమాహాత్మ్యమెఱుఁగ; వట్టి
    భవుని కొమ్మను మాయమ్మఁ బ్రస్తుతింతు.
    
సీ॥ ఏమహామహుఁడు సంస్కృతపాండితిని గొప్ప
            పర్వతంబని నుతుల్ వడయఁ గలిగె
    నేఘనుం డాంధ్రమందెల్లపండితులచే
            దిగ్ధంతియనుచుఁ గీర్తింపఁబడియె
    నేసద్గుణార్ణవుండెల్లెడఁ దర్కసిం
            హుఁడటంచుఁ బెనుకీర్తినొందఁ గలిగె
    నేకళావిదుఁడు వైయాకరణుల నిట్టి
            ఘనుఁడు లేఁడనుచు విఖ్యాతిఁ గాంచె

గీ॥ నట్టి కందాళ్లవంశ సుధాంబురాశి
    చంద్రుఁడైన దాసాచార్య సత్తముండు
    గురుఁడు దైవంబు; తత్పద సరసిజములు
    స్వాంతమున నెంచువాఁడ నపారభక్తి
    
మ॥ తననాధుండొనరించు సత్కృతుల కుత్సాహమ్మున దోడు చే
     యను గాక్షించి సహస్రహస్తముల శిష్యశ్రేణిఁ బోషింప నే
     ర్చిన మత్సద్గురు మానినీతిలక మా "శ్రీరంగమాంబా మహా
     జననీరత్నము” గొల్తు నెల్లపుడు సాక్షి దిందిరాదేవిగన్