పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

శ్రీ దేవీ భాగవతము

     వాఁడన కాదె యంచు; జెలువన్ బలుభంగుల బుజ్జగించె నా
     నాఁడు మొదల్‌ కుమారుని వనంబున కీ మహిమంబు వాటిలెన్. 438

చ. ఎఱిఁగినవారు పోరచటి కెవ్వడయేని యెఱుంగ కేగినన్
     తెఱవతనమ్ము వచ్చు నిఁకఁ దెల్పెడిదే మది కారణంబుగా
     నరపతి భామ యయ్యెను వనంబున జొచ్చుటఁ జేసి మంత్రులున్‌
     దెఱవల యైరి గుఱ్ఱమును దీటుకొనె న్వెస నాఁడుగోడిగై. 439

క. అంతట సుద్యుమ్నుఁడు దాఁ | జింతాక్రాంతుఁ డయి గృహము చేరి తదీయ
     ప్రాంతమునఁ దిరుగ నపుడా | యింతి కళానామధేయ మిడిరి జనంబుల్‌.440

క. తనతోడి వయస్యలతో వనితామణి హావభావ వైఖరు లొప్పన్
     వనమున విహరించుట గని ఘనుఁ డగు బుధుఁ డతివఁ జూచి కళవళ పడియెన్.441

ఉ. చక్కనిచుక్క నన్ను నిది చక్కని చుక్కని మెచ్చి యాడునో
     గ్రక్కున ధిక్కరించుచు నఖంబును బోలఁ డటంచు దూరునో
     మిక్కిలి తండ్రికీర్తి కడు మేలని చెప్పుకొనం దలంప న
     మ్మక్క తదీయవక్త్రరుచి కాతఁడు చాలఁ డటంచు నెంచునో.442

 ఉ. ఈ విమలాంగి కౌనుసిరికే సరి కేసరి యీ నెలంత కె
     మ్మోవి మెఱుంగు కింశుకము పూతను బూతను నేమిచెప్ప నా
     హా వనజాక్షి వేణి రుచి నబ్ధముఁ గా దను నీ వెలంది న
     న్నేవిధినేనిఁ గూర్మియిడి యేలఁగ నేలఁగవచ్చు లోకముల్‌.443

సీ. చెలియ కంఠస్వరశ్రీ లేలఁగాఁగాదె పికసంతతులు పరభృతము లయ్యె
     కలికి నెమ్మేని తళ్కుల కోడియేకాదె సౌదామనీలత చపల యయ్యె
     వెలఁది నెమ్మేని సౌరులఁ గాంచి వలపోసి రాజీవమదియు నీరజమ యయ్యె
     నతివ కన్దోయి సోయగముఁ జింతించుచుఁ కొమరు లీనెడుకల్వ కుముదమయ్యె

తే.గీ. కలికి పదమార్దవంబును గొలిచి కొలిచి । పేర్మిఁ జిగురాకు పల్లవాభిఖ్య జెందె
      దీని మధురాధరామృతాధీనుడ నయి ప్రథిత వైభవమున నేను బుధుఁడ నగుదు.444

వ. ఇ ట్లభంగురానంగపరవశుండై యయ్యంగనావయోవిలాసంబుల నంతరంగంబునఁ
     దలంచి వర్ణించుచు మందార తరు సందోహంబుల చాయల మరందసారణీధోరణుల
     దాపునం ద్రాక్షాలతాకాయమానంబుల నిలచి నిలచియున్నతఱి కన్నియయు నవ్వన్నెకానిం
     గాంచి పంచశరశరాన నిర్గళిత పుష్పబాణ పరంపరలు వెక్కసం బగుడుం దక్కిసలాడి
     నిక్కినిక్కి యొక్క యీరంబు చాటుననుండి యా చక్కదనాల యిక్క తనలో నిట్లని
     వితర్కించె. 445