Jump to content

పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శ్రీరంగమాహాత్మ్యము

షష్ఠాశ్వాసము

      శ్రీహరణ శాబనయనా
      మోహన కుచకలశఘసృణముద్రావిలస
      ద్బాహాంతర మునిహృత్కమ
      లా హితచంక్రమణ వేంకటాచలరమణా.
వ. అవధరింపు మిట్లు నాగదంతముహామునికి వ్యాసు లానతిచ్చిన తెఱంగు సూతుండు
      శౌనకాదుల నుద్దేశించి.
క. ఈజంబూతీర్థమున, భూజనులు న్నీవు గ్రుంకు భూవర యన నా
      రాజట్లన యొనరించిన, తేజము బలపుష్టి గలిగి దేహంబులకున్.
క. నీరోరగాత్రు లమలా, కారులునై రాజు ప్రజలు కాశ్యపువెనుకన్
      శ్రీరంగమార్గమున జను, వారలు గని రామ్రతీర్థవర్యము నెదురన్.
గీ. ఆమ్రతీర్థంబు డాయంగ నరిగి పనస, నారికేళ రసాల ఖర్జూర వకుళ
      నింబ జంబీర జంబూ కదంబ పూగ, పాటలీ కదలికా తరుప్రకరములను.
క. మీరిన యామ్రసరత్తీ, రారామములందు నున్న యనఘులతో నీ
      సారసిని మహిమమును మా, కేరుపడన్ బలుకు మనిన నిందఱు వినఁగన్.
మ. అపు డాసంయములందు భార్గవసమాఖ్యన్ మీరు మౌనీంద్రుఁడో
      నృప శ్రీరంగము చూడ భూమిసురుఁ డర్థిం బుష్కరాఖ్యుండు రా
      కపధోర్వి న్నెదిరించి బెబ్బులివలెన్ గన్పట్టి పట్టంగ నొ
      క్కపిశాచంబు పయింబడన్ గినిసి హంకారంబుతో విప్రుఁడున్.