పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

302

శ్రీనివాసవిలాససేవధి


పృథివీశుఁ డల కన్య పెనుపొంద తెరను
నిలిపిన వెన్నుండు నెమ్మితో కొమ్మ
తిలకించి ముదముజెంది చెలంగునవుడు
శ్రీనివాసునకు మున్ శ్రీదేవి నబ్ధి
పూని భక్తిని దారబోసినయటుల. 1250
ధరణీధరునకు నా ధరణీవిభుండు
ధరణీకుమారి నత్తరి దారవోసె
భువనైకదాతయై పొలయు శ్రీవిభుఁడు
యవనిజకై దాన మంది కేల్చాచె
వాణీశమతమున వనజాక్షి నతఁడు
పాణిగ్రహముసేసె బాళిఁ జేకొనుట
అంగనామణికిఁ గంఠాభరణముగ
మాంగల్యసూత్రంబు మమతసంధించె
దేవవాద్యము మ్రోసె దివి పుష్పవృష్టి
భూవలయము నిండఁ బొలుపొందఁ గురిసె. 1260
పాడిరి గంధర్వభామ లచ్చరలు
నాడిరి ముదమున నలరె లోకములు
అయ్యెడ దంపతు లన్యోన్య మెలమిఁ

తలంబ్రాలు.

జయ్యన తలిబ్రాలు సవరించినంత
జగతీజనములకు సంసారపుముడి
తగిలించిపెట్టిన తనకు నా జనులు
వీడుకువీడుగా వెలయఁ గొంగుముడి
వోడక పెట్టిరి యొగి దంపతులకు
తేజంబుగా నగ్నిదేవుం డెసంగ