పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

113


నింద్రియంబుల నిగ్రహించి సత్యైక
సాంద్రమానసముల శాంతిఁ బెంపొంది
పసదీర్చు బచ్చన ప్రతిమలపగిది
వెస పరకాయప్రవిష్టు లౌ వారి
తనువు లుండెడిరీతి తముఁదామె మఱచి
తనరెడుచాడ్పునన్ తన్మయానంద
భరితులై బ్రహ్మానుభవవైభవముల
స్థిరతరోగ్రతపంబు సేయుచునుండ

దశరథుఁడు పుత్రులు లేక దుఃఖించుట.

నపు డయోధ్యానాథుఁ డాదశరథుఁడు
విపులవిక్రమముల విలసిల్లి రాజ్య870
పాలనఁజేయుచు భావంబునందు
బాలురు లేమి నిర్భరశోక మంది
కులముద్ధరింపంగఁ గొడుకులులేమి
కలిమి యేమిటికి భోగంబు లేమిటికి
కొడుకులు లేని తేకువ వెతగాదె
కొడుకులు లేనిల్లు గోరియగాదె
కొడుకులు లేని మేల్ కొఱతయగాదె
కొడుకులు లేనిమేన్ కురుమోడుగాదె
యనుచు శోకింపుచు నడర నూర్పుచును
తనగురుని వసిష్ఠుఁ దలఁచిన నతఁడు880.
క్షణమాత్రమున వచ్చి కనుపట్ట నృపతి
ప్రణతుఁడై యతని కార్తితో నిట్టు లనియె
ఇనవంశదైవతం బీవకా నాదు
ఘనశోకములు దీర్పఁగాఁజాలు దనఘ