పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

శ్రీనివాసవిలాససేవధి


వెంటఁదోడ్కొని యేగువేళ నారదుఁడు
మింటిపైఁ జనుదెంచి మెల్లన డిగ్గి
తమ్మిచూలికి మ్రొక్కి తాపసోత్తముల
నెమ్మిఁ గౌగిటఁ జేర్చి నిలువ న న్నలువ
యాతఱిఁ గల కార్యమంతయుఁ దెల్పి
నాతండ్రి శ్రీజాని నారాయణుండు
వైకుంఠమున నున్నవాఁడొ క్షీరాబ్ధి
నేకాంతకేళిని నెనసియున్నాఁడొ
యెందు ప్రత్యక్షమై యీశ్వరుఁ గనుదుఁ
బొందుగాఁ దెలుపవే పుణ్యచరిత్ర750.
నీ వెఱుంగుదు వబ్జనేత్రునియునికి
నావుడు తండ్రి కానారదుండనియె

మునులకు నారద దర్శనము

వినుఁ డేను జలజాక్షు వేదైకచక్షు
వనరుహమందిరావాసోరువక్షు
బొడగని సేవింప బుద్ధి గాంక్షించి
కడువడి క్షీరాబ్ధికడ కేగి యందు
శ్రీకాంతుఁ గానక శీఘ్రంబు మరలి
వైకుంఠపురికిఁ బోవఁగ నందు కొంద
రా దివ్యభవనరత్నాంకణద్వార
వేదికల వసించు వేత్రధారకులు760,
ననుఁ జూచి యందుఁ బన్నగశాయి లేఁడు
చను ముర్వి వేంకటశైలంబునందు
నెలకొని శ్రీభూమినీళలు దాను
చెలగి విలాసముల్ జెందుచున్నాఁడు