పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము.

95


తొలుజన్మమునఁ దన దురితకర్మములు
తెలిసి పశ్చాత్తాపదీనభావమున
నల వాని కై నప్రాయశ్చిత్త మిలను
తీర్థయాత్రయె యంచు దివ్యంబు లైన
తీర్థంబు లన్నియు తిలకించు కొనుచు 430
భూమిప్రదక్షిణంబును జేయఁ గడిగి
కోమలి సుతులఁ గైకొనని విరక్తి
నారేయి నిదురించునపుడు స్వప్నమున
వారిజాక్షుఁడు కృప వాని కిట్లనియె
వినుము భూసురవర్య వేంకటశైల
మున సప్తదశతీర్థములు గల వందు
నొకదినంబును స్నానమొనరించువార
లకుఁ దీర్థయాత్రాఫలంబు సిద్ధించు
ధరవేంకటాద్రిప్రదక్షిణంబునను
బురుషులకు లభించు భూప్రదక్షిణము 440
వలన గల్గు ఫలంబు వనితలకై న
కలుగు నన్నట్లుగాఁ గలఁగని లేచి
యతఁడు మనంబున నాశ్చర్యమొంది
వెతకుచు జనుదెంచి వేంకటాచలము
కనుఁగొని సేవించి కపిలతీర్థంబు
మునుకొని యన్నీట మునిఁగి యాగిరికి
పొసఁగ ప్రదక్షిణంబును సల్సె నపుడె
యెసఁగె నాతని కెల్లనిష్టసంపదలు
కావున నట్టి వేంకటగిరి మహిమ
భావించి యెంతని పలుకశక్యంబొ 450