పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము.

87


యిది యేమిచోద్య మీయెడ నేన ముందు
పదునై దువరుసల బరికించి యందు
నిర్జనంబగుట నీనిలయంబు గాన
నిర్జరమాయఁ గన్పించెనో యిపుడు
కలయొ నిద్దురలేక కల యెట్లు గలుగు
కలవళంబున భ్రాంతిగాఁ దోఁచినదియొ
శ్రీనివాసుఁడు నన్ను జెలిమి రక్షింపఁ
దానె యీరూపంబు దాల్చి వచ్చుటయు
జనుల కదృశ్యుఁడై జగదీశ్వరుండు
దనరు నీగిరి నంచుఁ దపసి మున్ దెలిపె 250
నాదు భాగ్యవశంబునన్ దృశ్యుఁ డగుచు
నీ దివ్యగృహమున నెసఁగునో శౌరి
చొచ్చి చూచెదఁగాక సొలయ కే ననుచు
వచ్చి యాభవనంబు వడిఁ బ్రవేశించి
వరగోపురము దాటి ద్వారముల్ గడచి
పరికించి మణిమంటపములు వేదికలు
మరియుఁ గన్గొనుచు హేమమయసౌధములు
నరసి మహావిమానాంతరమ్మునను
చింతామణిమయ సింహాసనమునఁ
గాంతామణి యురంబు గదిసి రంజిల్లఁ 260
గౌస్తుభమణియందుఁ గడుదీప్తు లొసఁగ
నిస్తులవనమాల నెరి దావి నింప
విమలహారంబులు వెడనిగ్గు నెరప
కమనీయశంఖచక్రము లిరుగడల
నయనేందురవుల విన్నాణంబుఁ జూప